తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒమిక్రాన్ గుబులు.. పెరుగుతున్న కరోనా కేసులు! - ఇజ్రాయెల్​లో ఒమిక్రాన్ కేసులు

covid worldwide: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వివిధ దేశాల్లోకి వ్యాపిస్తుండడం వల్ల ఆయా దేశాలు భయం గుప్పిట్లోకి జారుకుంటున్నాయి. వైరస్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇక మిగతా దేశాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..?

corona cases worldwide, corona omicron variant, omircon worldwide
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

By

Published : Dec 4, 2021, 12:06 PM IST

Covid worldwide: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలు దేశాల్లో రోజువారీ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్​ కట్టడికి ఆయా దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 5,352 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 70 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

South korea covid cases: దక్షిణ కొరియాలో కొత్తగా మరో ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో ఆ దేశంలో మొత్తం ఒమిక్రాన్ సోకిన బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. తాజాగా ఒమిక్రాన్ నిర్ధరణ అయిన వ్యక్తులు నవంబరు 24న నైజీరియా నుంచి వచ్చిన వారని అక్కడి అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడి కోసం దక్షిణ కొరియా రాజధాని సియోల్​ సహా పరిసర ప్రాంతాల్లో గుమిగూడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏడుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట ఉండకూడదని తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న దక్షిణాఫ్రికా, నైజీరీయా వంటి దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించింది.

ఇదీ చూడండి:'ఐరోపా​ నుంచే ఒమిక్రాన్​.. నిజం చెప్పడమే మాకు శాపం'

రష్యాలో ఏ మాత్రం తగ్గని కరోనా మరణాలు

Russia coronavirus cases: రష్యాలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ దేశంలో అక్టోబరులో రికార్డు స్థాయిలో 74,893 మంది కరోనా కారణంగా చనిపోయారని రష్యా గణాంక విభాగం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి 2021 అక్టోబరు మధ్య కరోనా కారణంగా మొత్తం 5,37,000 మంది మరణించారని చెప్పింది. ఇది రష్యా కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ నివేదించిన కరోనా మరణాల సంఖ్య కంటే రెట్టింపు కావడం గమనార్హం.

Russia covid deaths: గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో కరోనా మరణాల రేటు 20.3శాతం పెరిగిందని రష్యా కరోనా టాస్క్ ఫోర్స్ అధిపతి, రష్యా ఉప ప్రధానమంత్రి తత్యానా గోలికోవా తెలిపారు. రష్యాలో కరోనా వ్యాక్సినేషన్ మందకొండిగా సాగుతుండటమే.. అక్కడ కరోనా కేసులు పెరుగుదలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 40శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి టీకా డోసులు అందాయి.

ఒమిక్రాన్ వేరియంటేనా..?

Russia omicron: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు శుక్రవారం నిర్ధరణ అయింది. వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.​ వారి వద్ద నుంచి సేకరించిన నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను రష్యా నిషేధించింది. వివిధ దేశాల నుంచి తిరిగి వచ్చే రష్యన్​వాసులు 14రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని స్పష్టం చేసింది. మరోవైపు... రష్యాలో కొత్తగా 32,930 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 1,217 మంది మరణించారు.

ఇదీ చూడండి:Omicron Precautions In India: 'ఇవి పాటిస్తే ఒమిక్రాన్​ను అరికట్టొచ్చు..!'

ఇప్పుడే చెప్పలేం..

Omicron singapore: ఒమిక్రాన్​ వేరియంట్​పై సింగపూర్ ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డవారిలో కరోనా లక్షణాలు విభిన్నంగా ఉంటాయా? లేదా ఇతర వేరియంట్ల కంటే తీవ్రంగా ఉంటాయా? అనే దానిపై ప్రస్తుతం ఆధారాలు లేవని చెప్పింది. వ్యాక్సిన్లు, మందులు పని చేయవు అనే విషయంపై సమాచారం లేదని పేర్కొంది.

మలేసియా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయిందని సింగపూర్ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారితో సన్నిహతంగా ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు చెప్పింది. సింగపూర్​లో కొత్తగా 766 మంది వైరస్ బారిన పడగా.. మరో 9 మంది కొవిడ్​తో మరణించారు.

అమెరికా అప్రమత్తం..

America omicron cases: న్యూయార్క్ నగరంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. బాధితునితో సన్నిహతంగా మెదిలిన వారిని గుర్తించేందుకు కాంట్రాక్ట్ ట్రేసింగ్​ను వేగవంతం చేసింది. సదరు బాధితుడు గత నెలలో మన్​హట్టన్​ కన్వెన్షన్ సెంటర్​లో 50,000 మందితో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యాడు. ఆ సమావేశంలో పాల్గొన్న మరో ఐదుగురికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే.. వారికి సోకింది ఒమిక్రాన్​ వేరియంటేనా? అని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:తొలుత ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకు!

ఇజ్రాయెల్​లో ఏడుగురికి ఒమిక్రాన్​..

Israel omicron: ఇజ్రాయెల్​లో ఒమిక్రాన్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. తమ దేశంలో మరో ఏడుగురు ఒమిక్రాన్ బారినపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. వారంతా దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వారని చెప్పింది. వారిలో నలుగురు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనివారు కాగా.. మరో ముగ్గురు వ్యాక్సిన్ తీసుకున్నవారని పేర్కొంది. మరో 27 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Canada omicron: ఇప్పటివరకు 15 మందికి ఒమిక్రాన్​ వేరియంట్ సోకినట్లు తేలిందని కెనడా ప్రభుత్వం తెలిపింది. ఒమిక్రాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details