కొవిడ్-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తించడానికి వినూత్నమైన యాంటిజెన్ రాపిడ్ టెస్ట్‌ను (ఏఆర్టీ) సింగపూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఓ వ్యక్తి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్ ఆనవాళ్లను పట్టేస్తుంది. దీన్ని ఎవరికివారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర ఏఆర్టీ పరీక్షల కన్నా చాలా మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రామాణిక పాలీమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్షలకు ఏ మాత్రం తీసిపోదని వివరించారు.
ఎందుకు?
కొవిడ్-19కు నోటి ద్వారా ఇచ్చే మందులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ ఇన్ఫెక్షన్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దే గుర్తించి, చికిత్స చేసే పరిస్థితులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడికక్కడే పరీక్ష నిర్వహించే వెసులుబాటు వల్ల కొవిడ్‌ను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించి, సరైన ఔషధాలను సూచించడానికి వీలవుతుంది.
ఏమిటీ పరీక్ష?
ఈ పరీక్షకు 'ప్యార్లల్ యాంప్లిఫైడ్ సెలైవా, ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్' (పాస్‌పోర్ట్) అని పేరు పెట్టారు. దీనిద్వారా నిమిషాల్లోనే ఫలితాన్ని రాబట్టవచ్చు. ఇందుకు అదనపు సాధనాలు, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం లేదు.