జలుబుకు కారణమయ్యే వైరస్ల తరహాలోనే కరోనా సైతం భవిష్యత్‌లో సీజనల్‌గా వచ్చిపోతుందంటున్నారు లెబనాన్‌లోని అమెరికా యూనివర్సిటీ ఆఫ్ బీరుట్ శాస్త్రవేత్తలు. సామూహిక రోగనిరోధ శక్తి సాధించిన తర్వాత మహమ్మారి వ్యాప్తి అంతగా ఉండకపోవచ్చని వారి అధ్యయనం చెబుతోంది.
సమశీతోష్ణ వాతావరణం ఉన్న దేశాల్లో కాలానుగూణంగా ప్రభావం చూపిస్తుందంటున్నారు పరిశోధకులు. ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ఈ పరిశోధనకు చెందిన వివరాలు ప్రచురితం అయ్యాయి.
రోగనిరోధక శక్తి సాధించే వరకు కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంటుందని చెబుతున్నారు పరిశోధన బృందంలోని సీనియర్ రచయిత హసన్ జరాకెట్. అప్పటికి వరకు ప్రజలు కొవిడ్‌తో జీవించడం నేర్చుకోవాలన్నారు.
"మా అంచనాలు నిజమా? కాదా? అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు మాకు తెలిసిన వివరాల ప్రకారం.. కరోనా సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉంది."
-హసన్ జరాకెట్, పరిశోధన బృందంలోని శాస్త్రవేత్త
ఇది వరకు వచ్చిన చాలా రకాల వైరస్లు మొదట తీవ్రంగా విజృంభించిన తర్వాత సీజనల్ వ్యాధులుగా మారిన సందర్భాలు ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. సాధారణ జలుబుకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజాతోపాటు చాలా రకాల కరోనా వైరస్లు సమశీతోష్ణ ప్రాంతాలలో శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని, అయితే ఉష్ణమండల ప్రాంతాలలో మాత్రం అవి ఏడాదంతా ఉంటాయని అంటున్నారు.
గాలి, ఉపరితలాలు, మానవుల ప్రవర్తన, ఉష్ణోగ్రతలు, జన సమూహాలను బట్టి వైరస్ మనుగడ ఉంటుందని బీరుట్ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది.
ఫ్లూతోపాటు ఇతర శ్వాసకోశ వైరస్‌లతో పోల్చితే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం కరోనాలో ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
టీకాల ద్వారా రోగనిరోధ శక్తిని పొందిన తర్వాత కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని వారు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అది సీజనల్‌గా వచ్చే వైరస్ మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే సామూహిక రోగ నిరోధక శక్తిని సాధించే వరకు కఠినమైన నియంత్రణ చర్యల పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరో శాస్త్రవేత్త యాస్సిన్ చెప్పారు.