భారత విద్యా వ్యవస్థపై కొవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా దేశంలో సుదీర్ఘ కాలంగా పాఠశాలలు మూతపడి ఉండటం వల్ల భారత్‌కు 400 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది.
'బీటెన్ ఆర్ బ్రోకెన్? దక్షిణాసియాలో కొవిడ్-19, అనధికారికత' పేరిట ప్రపంచ బ్యాంకు.. ఈ నివేదిక విడుదల చేసింది. దక్షిణాసియా దేశాల జీడీపీ తీవ్రంగా పడిపోతోందని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు ఎరుగని తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయేందుకు ఆయా దేశాలు సిద్ధంగా ఉన్నాయని విశ్లేషించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల మూసివేత వల్ల దక్షిణాసియాలోని దేశాలు 622 బిలియన్ డాలర్లు నష్టపోతాయని నివేదిక లో పేర్కొంది ప్రపంచ బ్యాంకు. ఇందులో సింహభాగం భారత్‌దే.
"పాఠశాలల పునఃప్రారంభం విషయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంపై ఈ అంచనాలు ఆధారపడి ఉన్నాయి. ఆసియా దేశాలకు సంబంధించిన గణాంకాలను సంక్షిప్తం చేస్తే.. పాఠశాలల మూసివేత వల్ల ఈ ప్రాంతం 622 బిలియన్ డాలర్లు కోల్పోతుంది. నిరాశావాద దృక్పథం ప్రకారం ఈ సంఖ్య 880 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నష్టంలో ఎక్కువ వాటా భారత్‌దే. ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఏడాదికి 400 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. ఆర్థిక ఉత్పాదకత ప్రకారం ఈ ఖర్చు కన్నా నష్టం చాలా ఎక్కువగా ఉంది."