కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నీంటిని ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రభావితం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా.. రెక్కాడితే గానీ డొక్కాడని లక్షల కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీసింది. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో వెల్లడించింది.
కరోనా సంక్షోభం.. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మహిళలు, ఆడపిల్లలను కటిక పేదరికంలోని నెట్టినేయనుందని వెల్లడించింది ఐరాస. దీనితో కలిపి పేదరికంలో కురుకుపోయిన మహిళల సంఖ్య 43.5 కోట్లకు పెరగనుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా వల్ల 2021 నాటికి మొత్తం 9.6 కోట్ల మంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని ఐరాస అంచనా వేసింది.
ఐరాస నివేదికలోని మరిన్ని విషయాలు..
- 2021 నాటికి రోజుకు సగటున 1.90 అమెరికన్ డాలర్ల ఆదాయం అంత కంటే తక్కువ సంపాదనతో.. 25 నుంచి 34 ఏళ్ల వయస్సున్న 100 మంది పురుషులు పేదరికంలో కునారిల్లుతుంటే మహిళల్లో ఈ సంఖ్య 118 గా ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 121కి పెరిగే ప్రమాదం ఉంది.
- మధ్య, దక్షిణ ఆసియాతో పాటు ఉప-సహారా ఆఫ్రికా ప్రాంతంలో పేదరిక పెరుగుదల అధికంగా ఉండనుంది. ప్రపంచవ్యాప్త పేదల్లో.. ఈ ప్రాంతంలోనే 87 శాతం మంది నివసిస్తుంటారు.
- ఆసియా ప్రాంతంలో 5.4 కోట్లు, ఆఫ్రికా ప్రాంతంలో 2.4 కోట్ల మంది కొత్తగా పేదరికంలోని జారుకునే ప్రమాదం ఉందని అంచనా.
- ప్రభుత్వాలు దీనిపై వీలైనంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోకుంటే.. మరింత కఠిన పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక.
ఇదీ చూడండి:చైనా కుటిల వ్యూహం: ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు!