సైనిక తిరుగుబాటు, అల్లర్లు, కరోనా మహమ్మారి... ఈ మూడు సమస్యలతో మయన్మార్ అతలాకుతలమవుతోంది. కొద్ది నెలల నుంచి దేశ ప్రజలంతా రాజకీయ ప్రతిష్టంభన మాటున మగ్గిపోతున్నారు. అధికారం కోసం తిరుగుబాటు సాగించి.. దాన్ని నిలుపుకోవడానికే మయన్మార్ జుంటా తన సర్వశక్తులు ఒడ్డుతున్న నేపథ్యంలో.. వైద్య వ్యవస్థ బలహీనంగా మారిపోయింది. ఇక కరోనా మహమ్మారి పంజా విసరడం.. ఆ దేశాన్ని కోలుకోనీయకుండా చేస్తోంది.
బలహీన వైద్య వ్యవస్థ కారణంగా మయన్మార్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. పది లక్షల జనాభాకు నమోదవుతున్న ఏడు రోజుల తలసరి మరణాల సంఖ్య 6.29కి పెరిగింది. మే నెలలో భారత్లో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటి సంఖ్యతో పోలిస్తే ఇది రెట్టింపు. దీన్ని బట్టి ఆ దేశంలో కరోనా ఏ స్థాయిలో మరణ మృదంగం మోగిస్తోందనే విషయం అర్థమవుతోంది.
రెండు వారాల్లో సగం దేశానికి!
మయన్మార్లో కరోనా సంక్షోభ స్థాయికి చేరిపోయిందని నిపుణులు చెబుతున్నారు. రెండు వారాల్లోనే దేశంలోని సగం జనాభాకు వైరస్ సోకుతుందని అంచనా వేస్తున్నారు. మయన్మార్ జనాభా 5.4 కోట్లు కాగా.. 2.7 కోట్ల మందికి పక్షం రోజుల్లోనే కరోనా సోకుతుందని చెబుతున్నారు. ఓ నివేదికను ఆధారంగా చేసుకొని ఐరాసలో బ్రిటన్ రాయబారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి టీకాలు ముందుగా అందించాలని మయన్మార్ రాయబారి.. ఐరాసను అభ్యర్థించారు.
ఇదీ చదవండి:వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వ్యాప్తి!
అధికారిక లెక్కల ప్రకారం మయన్మార్లో జూన్ నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు వారాల్లో కేసుల సంఖ్య 105 శాతం అధికమైంది. అయితే ఇందులో చాలా కేసులను పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అసలు కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.