చైనాలో మళ్లీ కరోనా కోరలు- రెండో రోజూ 100 కేసులు - చైనాలో కరోనా వైరస్
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. చైనాలోనూ మళ్లీ కేసులు విజృంభిస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 100కుపైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
చైనా
By
Published : Jul 30, 2020, 6:01 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 1.72 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ధాటికి 6.7 లక్షల మంది మృతి చెందారు. వైరస్‌పై పూర్తి ఆధిపత్యం సాధించిన చైనాలోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.
చైనాలో మళ్లీ విజృంభణ..
చైనాలో వరుసగా రెండో రోజు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) నివేదిక ప్రకారం బుధవారం 105 కేసులు నమోదు కాగా వీటిలో 102 స్థానికంగా సంక్రమించినవే.
వీగర్ ముస్లిం మెజారిటీ ప్రాంతమైన జిన్జియాంగ్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఇక్కడే 96 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కొత్తగా 21 లక్షణాలు లేని కేసులు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికాలో..
దక్షిణాఫ్రికాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం 4.71 లక్షల కేసులతో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 22 వేల మంది మరణించారు.
ఆఫ్రికా ఖండంలో మొత్తం 8.91 లక్షల కేసులు నమోదు కాగా.. అందులో సగం దక్షిణాఫ్రికాలోనివే కావటం గమనార్హం. అయితే టెస్టింగ్ కిట్లు, వైద్య సదుపాయాల లేమి కారణంగా ఆఫ్రికాలోని ఇతర దేశాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
తొలి 4 స్థానాల్లో..
కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మెక్సికో, పెరూ, చిలీ, ఇరాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియాలో వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది.