చైనా, పాకిస్థాన్ మధ్య ఎనలేని స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. పాక్ చేసే ఏ పనికైనా చైనా వత్తాసు పలుకుతుంది. బదులుగా చైనాకు వంతపాడుతుంది పాకిస్థాన్. అయితే చైనా దుర్బుద్ధి ముందు ఎలాంటి బంధమైనా బలహీనమైనదనే నిరూపితమైంది.
కరోనాను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు అన్ని రకాల సాయం అందిస్తామని చైనా తొలుత హామీ ఇచ్చింది. కరోనా టెస్టింగ్ కిట్లు, నాణ్యమైన ఎన్95 మాస్కులను ఎగుమతి చేస్తామని గొప్పగా ప్రకటించింది. అయితే చివరకు పాకిస్థాన్‌ను బురిడీ కొట్టించింది. నిస్సిగ్గుగా అండర్వేర్లతో తయారు చేసిన మాస్కులను పాక్‌కు ముట్టజెప్పింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ స్థానిక మీడియా సంస్థలు ధ్రువీకరించాయి. 'చైనా తమను మోసం చేసిందని' ఓ మీడియా సంస్థ ఆవేదన వ్యక్తంచేసింది. సింధ్ ప్రభుత్వం మాస్కులను తనిఖీ చేయకుండానే ఆస్పత్రులకు పంపించిందని పేర్కొంది.
"నాణ్యమైన ఎన్95 మాస్కుల పేరిట చైనా అండర్వేర్లతో తయారు చేసిన మాస్కులు పంపించింది. వైద్య సాయాన్ని పరిశీలించకుండా రాష్ట్ర అధికారులు అలసత్వం వహించారు. తనిఖీలు చేయకుండా మాస్కులను కరాచీలోని ఖతార్ ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు వీటిని చూసి చైనాను విమర్శించారు. పాకిస్థాన్‌ను చైనా బఫూన్‌ను చేసిందని వ్యాఖ్యానించారు."-లాహోర్ కేంద్రంగా పనిచేసే ఓ టీవీ ఛానెల్
గ్జింజియాంగ్ నుంచి సాయం
చైనా అధీనంలోని గ్జింజియాంగ్ ఉయ్ఘుర్ గవర్నర్ పాకిస్థాన్‌కు వైద్య సహాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ చైనా రాయబార కార్యాలయం, పాక్ విదేశాంగ శాఖకు లేఖ రాసినట్లు అక్కడి పత్రిక డాన్ పేర్కొంది. పత్రికలో వచ్చిన కథనం ప్రకారం 2 లక్షల సాధారణ మాస్కులు, 2 వేల ఎన్95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2 వేల టెస్టింగ్ కిట్లు, 2 వేల వైద్యులు రక్షణ కోసం వినియోగించే దుస్తులను గ్జింజియాంగ్ గవర్నర్ పంపినట్లు తెలుస్తోంది.