తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా తర్వాతి టార్గెట్ ఆసియానేనా! - కరోనా వార్తలు

అమెరికా, ఐరోపాలోని దేశాల తర్వాత ఆసియాలోనే కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి అక్కడి దేశాల్లో తగ్గుముఖం పడుతుండగా.. ఆసియాలో క్రమంగా విస్తరిస్తోంది. కొత్త కేసుల పెరుగుదల ఇక్కడి దేశాల్లోనే ఎక్కువ ఉంటోంది. కేసులు వేగంగా పెరుగుతున్న 39 దేశాల్లో 14 ఆసియాలోనే ఉన్నాయి. ఇందులో భారత్ నాలుగో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

coronavirus-poised-to-explode-in-asian-especially-in-poorer-countries
కరోనా తర్వాతి టార్గెట్ ఆసియానేనా!

By

Published : Apr 25, 2020, 8:19 AM IST

కరోనా వైరస్‌ ఇకపై ఆసియా దేశాల్లో విశ్వరూపం చూపనుందా? ఈ ప్రాంతంలో నానాటికీ పెరుగుతున్న కొత్త కేసులు ఇలాంటి ఆందోళనల్నే రేకెత్తిస్తున్నాయి. భారత్‌తో పాటు పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి దేశాలు ఈ జాబితాలో ఉండటం ఈ ప్రాంతవాసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. దాదాపు 39 దేశాల్లో కొత్త కేసులు వేగంగా పెరుగుతుంటే.. అందులో 14 ఆసియా దేశాలే.

వాటిలో భారత్‌, రష్యా, సౌదీఅరేబియా, సింగపూర్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఖతర్‌, కువైట్‌, కజకిస్థాన్‌, తైవాన్‌, శ్రీలంక, మాలి, ఆర్మేనియా, బ్రూనైలున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మొదటి 10 దేశాల్లో 7 ఆసియా దేశాలే.

కేసులు పెరుగుతున్న దేశాలు

రష్యా: మొదటి స్థానం

రష్యాలో కొన్ని రోజులుగా రోజుకు 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 68,622 అయ్యాయి. ఈ లెక్కన మరో మూడు రోజుల్లోనే మొత్తం కేసుల విషయంలో చైనాను మించిపోనుంది. రష్యాలో లాక్‌డౌన్‌ను ఆలస్యంగా అమలుచేయడం, క్వారంటైన్‌ను చాలామంది తేలికగా తీసుకోవడం, ఈస్టర్‌ ప్రార్థనల్లో భౌతిక దూరం పాటించకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. కొత్త కేసుల నమోదులో బ్రెజిల్‌ రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని కెనడా ఆక్రమిస్తోంది.

భారత్‌: కొత్త కేసుల్లో నాలుగో స్థానం

కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నా మనదేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో బాధితులు 30 వేలు దాటే అవకాశం ఉందన్న అంచనాలు కలవరపెడుతున్నాయి.

మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దేశంలోని మొత్తం కేసుల్లో 92 శాతం ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ఇక్కడ కాస్త ఊరట

కేసుల వేగం మందగించిన దేశాలు

దాదాపు 32 దేశాల్లో కొత్త కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. గత 20 రోజులుగా వైరస్‌ విశృంఖలంగా వ్యాపించిన అమెరికాలో ఇప్పుడు వేగం కాస్త మందగించింది. కరోనా దెబ్బకు కళ్లు తేలేసిన స్పెయిన్‌, జర్మనీ, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య నిలకడగా ఉండటం కాసింత ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌, ఇతర నిర్బంధాలు తొలగించాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. యూఏఈలోనూ పరిస్థితి కుదుటపడటంతో శుక్రవారం నుంచి ఒక్కొక్కటిగా ఆంక్షలు తొలగిస్తున్నారు.

కోలుకుంటున్న దేశాలు

కేసులు తగ్గుముఖం పడుతున్న దేశాలు

దాదాపు 65 దేశాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇందులో కొవిడ్‌తో నిండా మునిగిన ఇటలీ కూడా ఉండటం ఆ దేశానికి కొంతలో కొంత ఊరట. వైరస్‌ పుట్టుకకు కేంద్రమైన చైనాలోనూ కొత్త కేసులు చాలావరకు తగ్గిపోయాయి. ఫ్రాన్స్‌, టర్కీ, స్విట్జర్లాండ్‌, పోర్చుగల్‌, ఆస్ట్రియాలలో సైన్యం సహా వ్యవస్థలన్నీ చురుగ్గా పనిచేయడంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. తొలుత కరోనా బారిన పడిన ధనిక దేశాలు ఆ ప్రభావం నుంచి బయటపడుతుంటే.. ఆసియా, ఆఫ్రికాలోని పేద, వర్థమాన దేశాలు మహమ్మారి గుప్పిట్లోకి వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:పీఎం కేర్స్​కు 'కోల్​ ఇండియా' రూ.221 కోట్లు విరాళం

ABOUT THE AUTHOR

...view details