కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్లో లాక్డౌన్ విధించలేమని స్పష్టం చేశారు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈ చర్యల వల్ల గందరగోళం నెలకొంటుందని, ప్రజలే స్పచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. దేశంలో 25 శాతం కన్నా ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని.. లాక్డౌన్ ద్వారా వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయని తెలిపారు.
పాక్లో కరోనా కారణంగా నలుగురు మరణించారు. 700మందికిపైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నివారణ చర్యలపై పలు కీలక విషయాలు వెల్లడించారు ఇమ్రాన్.
''దేశవ్యాప్తంగా లాక్డౌన్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. కర్ఫ్యూ విధించి.. ప్రజలను వారి ఇళ్లలో బంధించడం. అలాంటి నిర్ణయాన్ని మేము స్వాగతించలేం. అది దేశంలో అశాంతి నెలకొనేలా చేస్తుంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే పాక్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఒకవేళ ఇటలీ వంటి పరిస్థితులు తలెత్తితే పూర్తి లాక్డౌన్ విధిస్తాం.
-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని