తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై పోరుకు 'సార్క్​' ముందడుగు

కరోనాను ఓడించేందుకు సార్క్​ దేశాలు చేతులు కలిపాయి. ప్రపంచ ప్రజారోగ్య సవాలును ప్రాంతీయ కూటమి సమష్టి వ్యూహంతో కలసికట్టుగా ఎదుర్కోవాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో సార్క్‌ కూటమిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది.

Coronavirus outbreak: PM Modi proposes SAARC emergency
మహమ్మారిని జయించేందుకు చేతులు కలిపారు!

By

Published : Mar 17, 2020, 8:48 AM IST

చాలాకాలంగా ఉలుకూపలుకూ లేక ఉనికి కోల్పోయిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్‌) కూటమికి కరోనా వైరస్‌ సంక్షోభం పునరుజ్జీవన అవకాశాల్ని కల్పించనుందా? 2016లో సార్క్‌ సదస్సు ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉండగా- ‘ఉరి’ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్‌ నేతృత్వంలో మిగతా దేశాలన్నీ ఆ సమావేశాల్ని బహిష్కరించాయి.అప్పట్నుంచి సభ్య దేశాల మధ్య అత్యున్నత రాజకీయస్థాయి చర్చలు జరగాలని శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు కోరుతూ వస్తున్నాయి. భారత్‌ మాత్రం చర్చలకు తగిన వాతావరణం లేదని స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్‌ తన భూభాగంపై పుట్టుకొస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిందేనని కరాఖండిగా తేల్చేసింది.

మోదీ పిలుపుతో..

ఈ క్రమంలో కరోనా వైరస్‌ సమస్య తీవ్ర రూపం దాల్చింది. మోదీ పిలుపు మేరకు సార్క్‌ కూటమిలోని ఎనిమిది సభ్య దేశాల నేతలూ- భారత్‌ నేతృత్వంలో నిర్వహించిన దృశ్య మాధ్యమ సదస్సులో పాల్గొన్నారు.

ఇందులో సార్క్‌ సభ్య దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు పాలుపంచుకున్నారు. పాక్‌ నుంచి మాత్రం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆరోగ్య రంగంలో ప్రత్యేక సహాయకుడు జాఫర్‌ మీర్జా హాజరయ్యారు. ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు స్వల్ప వ్యవధిలోనే ప్రాంతీయ నేతల నుంచి సమ్మతి లభించడం, సదస్సు ఫలప్రదం కావడంతో సార్క్‌ దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ విషయంలో ఆశలు చివురిస్తున్నాయి.

వెయ్యికళ్లతో కాపుకాయాలి

చైనా, ఇటలీలతో పోలిస్తే జనసాంద్రత అధికంగా ఉండే సార్క్‌ దేశాల్లో చాలా జాగ్రత్తగా, రోగ విస్తృతిని వెయ్యికళ్లతో గమనించాల్సిన అవసరం ఉంది. పరిస్థితులను చూస్తూ వదిలేయకుండా ముందుచూపుతో వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలి. ప్రాంతీయంగా ఈ దేశాల మధ్య బలహీన సరిహద్దులు, ఒకే తరహా పరిస్థితులు ఉన్న క్రమంలో చొరవగా భారతదేశమే ముందుగా పొరుగువారిని పలకరించిందని, ఒకరికొకరు సహకరించుకునే విషయంలో ఇది చాలా ముఖ్యమని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ‘కోవిద్‌-19’ విషయంలో సార్క్‌లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశానికీ విభిన్న సమస్యలున్నాయి. మాల్దీవుల వంటి చిన్న దేశం వద్ద సరిపడినన్ని వనరులు లేవు. శ్రీలంక, నేపాల్‌ వంటి దేశాలకు ఇటలీ, చైనాల నుంచి పెద్దయెత్తున పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ‘సార్క్‌’ చడీచప్పుడు లేకుండా ఉన్నా- ఇప్పటికైనా సమష్టి సహకార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.

అప్పటి నుంచి అచేతనం

సార్క్‌ సదస్సును 2016లో భారత్‌ బహిష్కరించిన నాటి నుంచి ఈ సంస్థ అచేతన స్థితిలో ఉంది. తాజాగా ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు ప్రాథమికంగా పాకిస్థాన్‌ సానుకూలంగానే స్పందించినా, ఆ తరవాత సదస్సులో పాల్గొనకూడదని ఇమ్రాన్‌ఖాన్‌ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు శస్త్రచికిత్స చేయించుకున్న నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ- ఓలీ ఆస్పత్రి నుంచి ‘డిశ్చార్జ్‌’ అయిన ఒక్కరోజు వ్యవధిలోనే సదస్సులో పాలుపంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

సదస్సులో పాకిస్థాన్‌ ప్రతినిధి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంపై భారత ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ- మన మిత్రులు మానవత్వ కార్యక్రమాన్ని కూడా రాజకీయమయం చేయడానికి యత్నించారని విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘సార్క్‌’ పునరుజ్జీవనం అంశం గురించి మాట్లాడటం మరీ తొందరపాటు చర్య అవుతుందని, తాజా పరిణామాల్ని ఎదుర్కొనేందుకు ‘సార్క్‌’ కూటమి నేతలంతా ఏకమవడం గురించే చర్చ జరుగుతోందని, ఇది మరికొన్ని ఇతర ప్రాంతీయ సమావేశాలకు దారితీస్తుందా- అనేది చెప్పలేమని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ వ్యాఖ్యలు ప్రతిస్పందనకు అర్హమైనవి కాదని, తన అసలు రూపాన్ని పాకిస్థాన్‌ మరోసారి ప్రస్ఫుటం చేసిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం గమనార్హం.

అనుసంధానం దిశగా..

కరోనా విజృంభణతో భారత్‌ ఇప్పటిదాకా వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలోనే భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. ఇటలీ, ఇరాన్‌లలో కరోనా పరీక్షల ఫలితాలు ‘నెగెటివ్‌’గా వచ్చిన మరికొంతమందిని, తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఇందుకోసం ఓ ప్రత్యేక విభాగం రాత్రింబవళ్లు పని చేస్తోంది.

సార్క్‌ ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటుకు తన వంతుగా భారత్‌ ప్రాథమికంగా కోటి డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. పొరుగు దేశాల వినతి మేరకు- వైద్య పరిశోధనలు మొదలు, సత్వర సహాయక బృందాలను పంపించేందుకూ సిద్ధమని ప్రకటించింది. సార్క్‌ విదేశాంగ కార్యదర్శులు, దౌత్య కార్యాలయాల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొంది. మాల్దీవుల వినతి మేరకు భారత్‌ 48 గంటల వ్యవధిలో అత్యవసర వైద్య బృందాన్ని పంపించింది. ఇరాన్‌ చేసిన వినతుల్నీ మానవతా దృక్పథంతో పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సార్క్‌ తరహాలోనే ఆన్‌లైన్‌ యంత్రాంగం ద్వారా కరోనా మహమ్మారిపై పోరుకు జీ-20 కూటమి మధ్య అనుసంధానాన్ని ప్రతిపాదించే దిశగా భారత్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

-స్మితా శర్మ(ప్రముఖ పాత్రికేయురాలు)

ఇదీ చదవండి:గుజరాత్​లో 67 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details