కరోనా టీకా కోసం ఎదురు చూస్తున్నవారికి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో ఉన్న 300కుపైగా టీకాలకు ఇది ఓ రకంగా శుభవార్తే. కరోనా వైరస్ తరచూ మార్పుల (ఉత్పరివర్తన)కు లోనవుతున్నందున టీకా సమర్థంగా పనిచేస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే వైరస్‌లో ఇటీవల జరిగిన మార్పుల వల్ల టీకాల సమర్థతపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆస్ట్రేలియాలోని 'కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్' (సీఎస్‌ఐఆర్‌వో)కు చెందిన ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ వుహాన్‌లో పుట్టిన సార్స్-కోవ్-2 వైరస్‌ను 'డి' రకంగా గుర్తించారు. ఈ రకం వైరస్‌ను ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా టీకాల అభివృద్ధి మొదలైంది. ఆ తర్వాత ఈ సూక్ష్మజీవిలో మార్పులు మొదలయ్యాయి. వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్‌లోని 614 అనే నిర్దిష్ట ప్రాంతంలో డి (యాస్పార్టేట్) అనే అమైనో ఆమ్లం.. 'జి' (గ్లైసిన్)గా మారింది. దీంతో ఈ మార్పును 'డీ614జీ'గా పిలుస్తున్నారు. దీన్ని కలిగిన కరోనా వైరస్‌ను 'జి' రకంగా వ్యవహరిస్తున్నారు.
మార్పు అక్కడే...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన సార్స్-కోవ్-2 జన్యుక్రమాల్లో 'జి' రకం వాటా ఏకంగా 85 శాతానికి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 'జి' రకం వల్ల ఈ వ్యాక్సిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. దీన్ని నిగ్గు తేల్చడానికి వాసన్ నేతృత్వంలో సీఎస్‌ఐఆర్‌వో బృందం ఫెర్రెట్స్ అనే ఒక రకం జంతువులపై పరిశోధన చేపట్టింది.
వీటిలో కొన్నింటికి 'డి' రకాన్ని, మరికొన్నింటికి 'జి' వైరస్‌ను చొప్పించారు. అభివృద్ధి దశలో ఉన్న ఒక టీకాను వాటికి ఇచ్చారు. రెండు వైరస్ రకాలపైన ఆ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేసిందని తేల్చారు.
''ఇది చాలా శుభవార్త. ఎందుకంటే.. ఈ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక టీకాలు రూపొందుతున్నాయి. డీ614జీ ఉత్పరివర్తన ఉన్నప్పటికీ టీకా సమర్థంగానే పనిచేస్తుందని తేలింది'' అని ప్రొఫెసర్ వాసన్ తెలిపారు.
భారత్‌లో 'జి' వైరస్ ఇలా..
- మే 3, 2020: ఆవిష్కరించిన మొత్తం 82 కరోనా వైరస్ జన్యుక్రమాల్లో 39 జీనోమ్‌లు 'జి' రకానివే.
- 30 జూన్: 974 జన్యుక్రమాల్లో 654 జన్యుక్రమాలు 'జి' రకం వైరస్‌వి ఉన్నాయి. అంటే.. మూడింట రెండొంతులకు అది పెరిగింది.
- 30 సెప్టెంబర్: 2112 జన్యుక్రమాలను విశ్లేషించగా అందులో 'జి' వాటా 1715 జీనోమ్‌లుగా ఉంది. మూడు నెలల్లో ఆ రకం వైరస్ 81.2 శాతానికి పెరిగింది. అదే రోజుకు ప్రపంచవ్యాప్తంగా దీని వాటా 84.6 శాతానికి చేరింది.