కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్‌ను లో-రిస్క్ ఏరియా(ప్రమాదం తక్కువ ఉన్న ప్రాంతం)గా గుర్తించింది చైనా. వుహాన్‌లో మృతుల సంఖ్యను సవరించిన కొద్ది రోజులకే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇప్పటికే వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది చైనా.
కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించింది చైనా. 14 రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కాకపోతే అది లో-రిస్క్ ప్రాంతమని, 50 కేసుల్లోపు లేదా 50 కేసులుపైగా నమోదైనా అది మిడ్-రిస్క్ ప్రాంతమని పేర్కొంది. 50కుపైగా కేసులు ఉంటే హై-రిస్క్ ప్రాంతంగా విభజించింది.
అయితే చైనావ్యాప్తంగా ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 16 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ దేశంలో మొత్తం 82వేల 735మంది ఇప్పటివరకు వైరస్ బారినపడ్డారు. 4,632మంది మృతిచెందారు.
దక్షిణకొరియాలో...
దక్షిణకొరియాలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల్లో రోజువారీ వైరస్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10వేల 661మందికి వైరస్ సోకింది. మొత్తం 234మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
అయితే దక్షిణకొరియా ప్రజలు భౌతిక దూరం నిబంధనను అశ్రద్ధ చేస్తుండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. కేసులు సంఖ్య తగ్గినప్పటికీ.. వైరస్ విజృంభించే అవకాశాలు చాలా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.