కరోనా బారి నుంచి చైనా మెల్లగా కోలుకుంటుండగా.. మరోవైపు ఇతర దేశాల్లో వైరస్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంటే.. ఇతర దేశాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య చైనాలో నమోదైన కేసులను మించిపోయిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. ఒక్క మంగళవారమే చైనాలో 411 కొత్త కేసులు నమోదు కాగా.. ఇతర దేశాల్లో 427 కేసులను గుర్తించినట్లు ఐరాస ఆరోగ్య సంస్థ వివరించింది.
తాజాగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాల్లో కరోనా కేసులు పెరగడం వల్ల.. అక్కడి ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అకస్మాత్తుగా వైరస్ కేసులు ఎక్కువగా నమోదుకావడం ఆందోళన రేకెత్తిస్తోందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.