ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మూలాలు చైనాలోని వుహాన్‌లో ఉన్నాయని యావత్ ప్రపంచం భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం వచ్చే నెలలో చైనాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వుహాన్ నగరం స్పందించింది. ఈ దర్యాప్తునకు భయపడేది లేదంటోన్న వుహాన్ వాసులు... దర్యాప్తు ద్వారా వైరస్ ఇక్కడ ఉద్భవించలేదనే విషయం నిరూపితమవుతుందని ఆశిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ బృందం రావడాన్ని స్వాగతిస్తున్నాం. వైరస్ ఎలా అభివృద్ధి చెందిందో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ వైరస్ ఇక్కడే బయటపడిందని తెలిస్తే... అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే వీలుంటుందని వుహాన్‌కు చెందిన ఓ పౌరుడు వార్తా ఏజెన్సీతో పేర్కొన్నాడు. అయితే, ఆ మార్కెట్ నుంచే వచ్చిందని మాత్రం నమ్మడం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ దర్యాప్తునకు మేము భయపడటం లేదని... ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు సవ్యంగానే ఉన్నట్లు మరో స్థానిక వ్యాపారి పేర్కొన్నాడు. జనవరి నెలలో అంతర్జాతీయ బృందం చైనాలో కొవిడ్ మూలాలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వుహాన్ వాసులు ఇలా స్పందిస్తున్నారు.
వ్యతిరేకిస్తోన్న చైనా..
కరోనా వైరస్ మహమ్మారి వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార మార్కెట్‌లో తొలుత బయటపడ్డట్లు భావిస్తున్న విషయం తెలిసిదే. అక్కడి నుంచి అనతికాలంలోనే యావత్ ప్రపంచానికి వ్యాపించిన వైరస్, ఇప్పటికే లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అయితే, వైరస్ మూలాలపై చైనా తొలుత మౌనంగానే ఉన్నప్పటికీ.. తర్వాత ఖండిస్తూ వస్తోంది. ఇతర దేశాల నుంచే చైనాకు వైరస్ వచ్చిందనే కొత్త వాదనను మొదలు పెట్టింది. ఈ సమయంలో వైరస్ మూలాలపై అంతర్జాతీయ స్వతంత్ర బృందం దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపడాన్ని మాత్రం తొలుత చైనా వ్యతిరేకించింది. చివరకు డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో జరిగే దర్యాప్తునకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కరోనా మూలాలను కనుగొనేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం జనవరిలో చైనాలో పర్యటించనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా ప్రకటించింది.