జ్వరం, దగ్గు వంటి లక్షణాలు లేనివారూ వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశాలు ఎక్కువని చైనా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అమెరికా సీడీసీకి చెందిన ఎమర్జింగ్ ఇన్‌ఫెక్షియస్ డీసీజెస్ పత్రికలో ప్రచురితమైన వ్యాసం ఈ ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల విదేశాల నుంచి చైనాకు తిరిగొచ్చిన ఇద్దరు విద్యార్థులను ముందు జాగ్రత్తగా ఓ హోటల్‌కు తరలించి, వేర్వేరు గదుల్లో ఉంచారు. వారిలో దగ్గు, జ్వరం వంటి లక్షణాలు మచ్చుకైనా లేవు.
అయితే రెండో రోజున చేసిన పరీక్షలో ఆ విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్టు బయటపడింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిదని పరిశోధకులు ఆ విద్యార్థులు బస చేసిన హోటల్ గదిని పరిశీలించారు. తలుపు గడియలు, స్విచ్చులు, థర్మామీటర్లు, టెలివిజన్ రిమోట్లు, దిండు కవర్లు, దుప్పట్లు, కొళాయిలు, టాయిలెట్ సీట్లు, ఫ్లషింగ్ భాగాల మీద.. ఇలా మొత్తం 22 చోట్ల నుంచి నమూనాలు తీసుకొని, పరీక్షించారు. వీటిల్లో 8 వస్తువుల మీద కరోనా వైరస్ ఉన్నట్టు తేలటం గమనార్హం.