కరోనా కోరల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్న ప్రపంచం ముందు కొత్త సవాల్ వచ్చిపడింది. ఈ మహమ్మారి కారక సార్స్-కోవ్-2 వైరస్.. మింక్ అనే జీవిలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో మార్పు (ఉత్పరివర్తన) చెందింది. ఇలా మారిన రకం తిరిగి మానవుల్లోకి ప్రవేశించడం కలవరం రేకెత్తిస్తోంది.
డెన్మార్క్‌లో ఇది ఎక్కువగా కనిపించింది. ఫలితంగా పెంపకం కేంద్రాల్లోని 1.7 కోట్ల మింక్‌లను చంపేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త ఉత్పరివర్తన వల్ల భవిష్యత్‌లో కొవిడ్-19 టీకాలు నిష్ప్రయోజనమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియాలో కొవిడ్-19పై పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ శేషాద్రి వాసన్.. ఈ రకం వైరస్ తీరుతెన్నులను ‘ఈనాడు’కు వివరించారు.
భారత్‌లో లేదు
కరోనా వైరస్‌లో కొత్తగా గుర్తించిన ఈ ఉత్పరివర్తనకు 'వై453ఎఫ్'గా పేరు పెట్టినట్లు వాసన్ తెలిపారు. ఆయన ఆస్ట్రేలియన్ 'సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్‌నెస్'లో కొవిడ్-19పై పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు. 'వై453ఎఫ్' రకం ఉత్పరివర్తన భారత్‌లో వెలుగు చూడలేదని వాసన్ పేర్కొన్నారు.
"కరోనా అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది మార్పులకు లోనవుతూనే ఉంటుంది. దానిపై మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కరోనాలో డీ614జీ అనే ఉత్పరివర్తన చోటుచేసుకుంది. ఇది భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రబలంగా ఉంది. ఈ డీ614జీ వల్ల టీకాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని మేం ఇప్పటికే రుజువు చేశాం. అయితే వై453ఎఫ్ గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేం" అని వాసన్ తెలిపారు.
వైరస్ జన్యుక్రమాలకు సంబంధించిన ప్రపంచ వేదిక ‘జీఐఎస్‌ఏఐడి’ వద్ద ఈ నెల 12 నాటికి అందుబాటులో ఉన్న 1,97,274 కరోనా వైరస్ జన్యుక్రమాలపై తాము విశ్లేషణ జరిపినట్లు ఆయన చెప్పారు. అందులో 387 కేసుల్లో వై453ఎఫ్ ఉత్పరివర్తన కనిపించిందన్నారు. 340 కేసులు మానవుల్లోను, 42 కేసులు అమెరికన్ మింక్‌ల్లో, ఐదు ఐరోపా మింక్ జంతువుల్లో ఇది వెలుగు చూసిందని వివరించారు.
తీవ్రతపై పరిశోధనలు
వై453ఎఫ్ వైరస్ సోకినవారిలో వ్యాధి లక్షణాల తీవ్రత; వయసు, ఇతరత్రా సమస్యల వల్ల పడే ప్రభావం వంటి అంశాలపై పరిశోధనలు జరుపుతున్నట్లు వాసన్ తెలిపారు. మింక్‌లు చాలా వరకూ ఫెర్రెట్ అనే జంతువులను పోలి ఉంటాయి. ఫెర్రెట్‌లకూ కరోనా సోకే ప్రమాదం ఉందని వాసన్ నేతృత్వంలోని బృందం తొలిసారిగా రుజువు చేసింది.
ఆందోళన ఎందుకు?
మింక్‌లను డెన్మార్క్‌లో ఉన్ని కోసం పెంచుతారు. అక్కడి పెంపకం కేంద్రాల్లో పనిచేస్తున్నవారికి కరోనా సోకడంతో తాజా ఉత్పరివర్తన వెలుగు చూసింది. ఇతర జీవుల్లోకి ప్రవేశించి, తమ సంతతిని పెంచుకునే క్రమంలో వైరస్‌లలో మార్పులు సహజమే. వాటితో చాలావరకూ హాని ఉండదు. ఇప్పుడు మానవుల నుంచి మింక్‌లోకి ప్రవేశించి, తిరిగి మానవుల్లోకి ప్రవేశించడం వల్ల అది ఎక్కువ మార్పులకు లోనై ఉంటుందని భావిస్తున్నారు. దీనికితోడు మానవుల్లో ప్రవేశించడానికి కరోనా వైరస్ ఉపయోగించుకునే ‘స్పైక్ ప్రొటీన్’లోనే ఈ మార్పు జరగడం కలకలం సృష్టిస్తోంది. ఎందుకంటే ఈ మహమ్మారిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న టీకాల్లో ఎక్కువ భాగం ఈ స్పైక్ ప్రొటీన్‌నే శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి:వాల్వులున్న మాస్కులతో కరోనా కట్టడి కష్టమే!