తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా: చైనా సామాజిక జీవనంపై పెను ప్రభావం

కరోనా.. ఈ మూడక్షరాల పేరు ఇప్పుడు చైనీయులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎవరైనా తలుపు తడితే భయపడుతున్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చిన వారిని చూస్తే వణికిపోతున్నారు. అందరూ మాస్కులు వేసుకునే తిరుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చైనాలో సామాజిక జీవనంపై కరోనా వైరస్‌ పంజా విసిరింది. ఆర్థికంగానూ ఆ దేశంపై ఇది ప్రభావం చూపిస్తోంది.

corona-greater-impact-on-chinese-social-and-economic-life
కరోనా: చైనా సామాజిక జీవనంపై పెను ప్రభావం

By

Published : Feb 9, 2020, 7:16 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

చైనీయుల్లో కరోనా వైరస్​ వణుకు పుట్టిస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్​ ధాటికి వందలాది ప్రజలు బలవుతున్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తికి కీలక కేంద్రం వుహాన్‌ నగరం. ఇది సెంట్రల్‌ చైనాలోని హుబే ప్రావిన్సులో ఉంది. దేశవ్యాప్తంగా కరోనా సోకినవారిలో 65 శాతానికి పైగా ఈ ప్రావిన్స్‌కు చెందినవారే. దీంతో వుహాన్‌, హుబేల పేర్లు చెబితేనే చైనీయులు హడలెత్తిపోతున్నారు. అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారేమోనన్న భయం వారిని నిద్ర పోనివ్వడం లేదు.

ఎక్కడ చూసినా అనుమానమే...

చైనాలో జనవరి 25 నుంచి లూనార్‌ కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమవుతుంటాయి. దీంతో వారం, 10 రోజుల పాటు పరిశ్రమలు, సంస్థలను మూసివేస్తుంటారు. ఈ సమయంలో లక్షల మంది బంధుమిత్రులను కలిసేందుకు దేశమంతా పర్యటిస్తుంటారు. ఇదే సమయంలో చైనాలో కరోనా వైరస్‌ విజృంభించింది. దీంతో దేశంలో పర్యటించి వస్తున్నవారిని.. స్థానికులైనప్పటికీ అన్నిచోట్ల అడ్డుకుంటున్నారు. అనుమానంగా చూస్తున్నారు. సెలవులు ముగియడంతో హుబెయ్‌ ప్రావిన్సుకు ఎవరు వెళ్లి వస్తున్నారో తెలుసుకోవడం స్థానిక ప్రభుత్వాలు, కమ్యూనిటీ సంస్థలకు సమస్యగా మారింది. బీజింగ్‌లో ఇలా వెళ్లివచ్చినవారిపై నియంత్రణలు విధిస్తున్నారు.

'మీరు అక్కడి నుంచి వ్యాధులను తీసుకొస్తారు.'’ అంటూ సెక్యూరిటీ గార్డులే ఆపేస్తున్నారు. చివరకు అనుమతించినా రెండు వారాల పాటు పూర్తిగా పరిశీలనలో పెడుతున్నారు. ప్రతిరోజూ శరీర ఉష్ణోగ్రతలు చూసుకోవాల్సిందే. ఒకసారి ఇళ్లకు వస్తే వారు బయటకు రాకపోకలు సాగించడానికి వీల్లేని పరిస్థితి ఉంది. ఎవరికైనా ఆహారం అవసరమైతే స్థానిక కమిటీలే అందిస్తున్నాయి.

బీజింగ్‌లోని ఓ ప్రాంతంలో 2,400 ఇళ్లుండగా.. స్థానిక కమిటీ ప్రతిరోజూ ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య రికార్డులను పరిశీలిస్తోంది. వాళ్లు ఎక్కడికి వెళ్లి వచ్చారన్నదీ ఆరా తీస్తోంది. చెంగ్డూ (నైరుతి సిచువాన్‌ ప్రావిన్సు) నుంచి వచ్చిన ఓ మహిళను కాంపౌండ్‌ వద్దే ఆపివేయడంతో ఆమె బీజింగ్‌ వెస్ట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఉండాల్సి వచ్చింది. తిరిగి వెళ్లిపోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి ఎదురైంది.

ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం..

ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం..

కరోనా ప్రభావంతో చైనాలో పరిశ్రమలు, లాజిస్టిక్‌ హబ్‌లు మూతపడ్డాయి. ఇప్పటికే లూనార్‌ కొత్త సంవత్సరంతో మూసివేసిన పరిశ్రమలు ఇక ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ప్రపపంచవ్యాప్తంగా క్రమేపీ వీటికి ముడి సరుకులు, ఉత్పత్తుల అనుసంధానత దెబ్బతింటోంది. విమాన, రోడ్డు, నౌకాయానంలో రావాల్సిన వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం ఎదురైంది. ప్రధానంగా వుహాన్‌కు సమీపంలోని యాంగ్జ్‌ నది మీదుగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. చైనా నుంచి ఐరోపాకు వెళ్లే రైళ్లను వుహాన్‌ను తప్పిస్తూ దారి మళ్లిస్తున్నారు.

'మొత్తం రవాణా మార్గాలను మూసేయడంతో వుహాన్‌ నుంచి ఏమీ తేలేకపోతున్నాం.. అక్కడికి ఏమీ పంపించలేకపోతున్నాం. అత్యవసర వస్తువులు, మందులు తప్ప ఏవీ రవాణా చేయడం లేదు.'’ అని ఓ ప్రముఖ రవాణా సంస్థ వెల్లడించింది.

జీడీపీపై పెద్ద దెబ్బ....

ఎక్కువ కాలం ఆర్థిక కార్యకలాపాలు జరగకపోతే చైనా జీడీపీపై ఆ ప్రభావం ఉంటుందంటూ.. 2003లో సార్స్‌ వైరస్‌ వ్యాపించినప్పటి పరిస్థితులను నిపుణులు గుర్తుచేస్తున్నారు. చైనాలో ఆటో రంగంలో దాదాపు 48 శాతం వుహాన్‌, పరిసర ప్రాంతాల్లోనే పరిశ్రమలున్నాయి. దీంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం ఉంది.

బీజింగే కాదు.. వుహాన్‌కు 800 కి.మీ.ల దూరంలో ఉన్న వెన్‌ఝ్‌వోలోనూ, 850 కి.మీ.ల దూరంలోని జెజియాంగ్‌ తూర్పు ప్రావిన్సులోనూ, తైఝోవు నగరంలోనూ స్థానికుల రాకపోకలను నియంత్రించారు. ప్రతి రెండు రోజులకోసారి ఒక ఇంటి నుంచి ఒకరిని మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

రాకపోకలపై ఆంక్షలు...

హుబే నుంచి తైఝోవులోకి రాకుండా 95 రైళ్లను రద్దు చేశారు. గేటెడ్‌ కమ్యూనిటీస్‌లో ప్రజల రాకపోకలకు ఒక ద్వారాన్ని మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. ఎవరైనా తప్పనిసరై బయటకు వెళ్తే గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సిందే. హుబే తర్వాత అత్యధికంగా 829 కరోనా కేసులు నమోదైన జిజియాంగ్‌ ప్రావిన్సులోనూ ఇలాంటి ఆంక్షలే అమల్లో ఉన్నాయి.

రాకపోకలపై ఆంక్షలు...

షిజియాజ్‌హువాంగ్‌ నగరంలో అయితే ఎవరైనా వుహాన్‌ వెళ్లివచ్చిన వారి గురించి వివరాలు అందిస్తే 2,000 యువాన్‌ (రూ. 20 వేలకు పైగా) నగదు బహుమతిని కూడా అందిస్తున్నారు. ఇక తెలియని వారెవరైనా సూట్‌కేసులతో కనిపిస్తే అడ్డుకుంటున్నారు.

Last Updated : Feb 29, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details