Corona cases in South Korea: దక్షిణ కొరియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే.. అత్యధికంగా ఐదు వేలకుపైగా కేసులు, 94 మరణాలు సంభవించాయి. బాధితుల్లో 900 మంది పరిస్థితి విషమంగా ఉంది.
డెల్టా వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెందడం వల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు, వ్యాక్సినేషన్ పూర్తికానివారే అధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో పడకల కోసం పడిగాపులు కాస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని.. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నిపుణులు హెచ్చరించారు.
రాజధాని సియోల్ సహా పలు మెట్రోపాలిటిన్ నగరాల్లో వైద్య సదుపాయల కొరత ఏర్పడిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పార్క్ హయాంగ్ అన్నారు. కొవిడ్ రోగుల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 86 శాతం ఐసీయూలు నిండుకున్నాయని.. మరో 800 మందికిపైగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడటానికి సమర్థమైన చర్యలు చేపట్టాలని.. లేదంటే భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశముందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.