దేశాల మధ్య చర్చలు మూడో పక్ష ప్రయోజనాలు దెబ్బతీసే ఉద్దేశంతో జరగరాదని అన్నారు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్. ప్రతిగా పరస్పర అవగాహన పెంపునకు జరగాలని చెప్పారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా (క్వాడ్) కూటమి శుక్రవారం వర్చువల్గా సమావేశం కానున్న నేపథ్యంలో లిజియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశాల మధ్య చర్చలు, సహకారం.. మూడో వ్యక్తుల(దేశాల) ఆశయాలను దెబ్బతీయడానికి కాక పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు జరగాలి. ఒక దేశాన్ని నష్ట పరిచేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయరాదు. సంబంధిత దేశాలు(క్వాడ్).. పారదర్శకత, సమ్మిళిత, ఇరువురికీ లాభం అనే సూత్రాలను పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధన కోసం చర్చలు జరగాలి."