రష్యాలో కంట్రోల్ రూంతో సంబంధాలు కోల్పోయి గల్లంతైన విమానం సముద్రంలో కుప్పకూలింది. తీర ప్రాంతంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి. ఓఖోట్స్క్ ఎయిర్‌పోర్ట్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా విమానం.. సిగ్నల్ కోల్పోయింది. దీంతో విమానం పడిపోయిందని భావించిన ప్రదేశంలో తనిఖీలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 28 మంది ఉన్నారు.
కాగా.. ఈ విమాన ప్రధాన భాగం సముద్ర తీర ప్రాంతంలో కనిపించిందని కమ్చాట్కా రాష్ట్ర గవర్నర్ వ్లాదిమిర్ సోలోదోవ్ తెలిపారు. ఈ ప్రదేశానికి కొద్ది దూరంలో మరికొన్ని శకలాలు కనిపించాయని చెప్పారు. విమానంలో ఉన్న 28 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని స్థానిక మీడియా పేర్కొంది. నౌకలు, విమానాలను ఉపయోగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
వాతావరణ ప్రతికూలత!
మరోవైపు, ఈ ఘటనపై ఇప్పటికే రష్యా అధికారులు విచారణకు ఆదేశించారు. భద్రతా ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ల్యాండింగ్ సమయంలో వాతావరణం మేఘావృతమై ఉందని, పైలట్‌కు పరిసరాలు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు.