తెలంగాణ

telangana

ETV Bharat / international

'స్నేహపూర్వకంగా రండి.. దర్యాప్తు కోసమైతే వద్దు!' - చైనా

మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టేందుకు సహకరించాలన్న యూఎన్​హెచ్​ఆర్​సీ వినతిని తిరస్కరించింది చైనా. స్నేహపూర్వక పర్యటన కోసమైతే రావాలని, దర్యాప్తు వంకతో రావొద్దని స్పష్టం చేసింది. మరోవైపు.. ఉయ్​గుర్ల మారణహోమంపై 42 దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.

china
చైనా

By

Published : Jun 23, 2021, 12:01 PM IST

షింజియాంగ్​లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై వస్తున్న వార్తలను ధ్రువీకరించేందుకు సరైన రీతిలో దర్యాప్తు జరగాలన్న యూఎన్​హెచ్​ఆర్​సీ పిలుపును సున్నితంగా తిరస్కరించింది చైనా. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్​ మిచెల్​ బచెలెట్​​ స్నేహపూర్వక సందర్శనకు రావొచ్చని, తప్పు జరుగుతోందన్న అంచనాలతో దర్యాప్తు చేసేందుకయితే రావొద్దని స్పష్టం చేసింది.

జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవ హక్కు మండలి 47వ సాధారణ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు బచెలెట్​ 'షింజియాంగ్​ ఉయ్​గుర్​ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో పర్యటన, సరైన విధంగా సమాచారం పొందటం కోసం చైనాతో నేను చర్చలు కొనసాగిస్తున్నా. ముఖ్యంగా తీవ్రంగా మానవహక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు వస్తున్న క్రమంలో.. ఈ ఏడాదే అది జరుగుతుందనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నారు.

బచెలెట్​ వ్యాఖ్యలపై విలేఖరులు ప్రశ్నించగా స్నేహపూర్వకంగా సందర్శించొచ్చని తెలిపారు డ్రాగన్​ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్​.

"యూఎన్​ మానవ హక్కుల విభాగం అధినేత.. షింజియాంగ్ సంబంధిత అంశాలపై చేసిన వ్యాఖ్యలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయి. చైనాలోని షింజియాంగ్​ ప్రాంతాన్ని సందర్శించేందుకు హైకమిషనర్​ను స్వాగతిస్తున్నాం. ఈ అంశంపై చర్చిస్తున్నాం. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని పెంపొందించటమే లక్ష్యంగా ఉండాలి. కానీ, తప్పు జరుగుతోందన్న అంచనాలతో దర్యాప్తు చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రం ఉండకూడదు. ఈ విషయంపై రాజకీయం చేయాలనే ఏ ప్రయత్నాన్ని సహించబోం. చైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని దేశాలు అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. "

- ఝావో లిజియాంగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

షింజియాంగ్​ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక దాడులకు ఈస్ట్​ తుర్కిస్థాన్​​ ఇస్లామిక్​ మూవ్​మెంట్​ కారణమని ఆరోపించింది చైనా. 2013లో బీజింగ్​లో జరిగిన దాడికి వారే కారణమని తెలిపింది.

42 దేశాల ఆందోళన..

ఉయ్​గుర్ల మారణహోమంపై ఐరాస మానవ హక్కుల మండలిలో ఆందోళన వ్యక్తం చేస్తూ 42 దేశాల తరఫున సంయుక్త ప్రకటన చేసింది కెనడా. స్వతంత్ర పరిశీలకులను వెంటనే అనుమతించి సమాచారం సేకరించేందుకు చైనా సహకరించాలని డిమాండ్​ చేసింది. ఈ ప్రకటనకు జర్మనీ, ఫ్రాన్స్​, ఇటలీ, జపాన్​, ఆస్ట్రేలియా, బ్రిటన్​, స్పెయిన్​, అమెరికా వంటి అగ్ర దేశాలు మద్దతు ప్రకటించాయి. ఉయ్​గుర్లు, ఇతర మైనారిటీలను నిర్బంధించటాన్ని ఆపేయటం సహా జాతి వివక్షతను రూపుమాపేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది కెనడా.

ఇదీ చూడండి:రక్షణ శాఖ వెబ్​సైట్ల హ్యాకింగ్​కు చైనా యత్నం!

ABOUT THE AUTHOR

...view details