Pakistan Snow Deaths: హిమపాతం మధ్య కొండప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వెళ్లి.. కానరాని లోకాలకు వెళ్లారు కొంతమంది పర్యటకులు. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని 21 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది.
ఏమైందంటే..?
పాకిస్థాన్, ఇస్లామాబాద్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. అందుకే శీతాకాలంలో హిమపాతం నడుమ ఈ అందాలను ఆస్వాదించేందుకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.
ఈ ప్రాంతంలో శనివారం ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి. మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలో పర్యటకులు కార్లలోనే ఇరుక్కుపోయారు. కార్లు మొత్తం మంచుతో నిండిపోయాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. పర్యటకుల శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి (హైపోథెర్మియా) 21 మంది మృతిచెందారు.