ప్రపంచంలోని అన్ని దేశాలపై కరోనావైరస్ మహమ్మారి కాలనాగై విషం చిమ్ముతోంది. అగ్రరాజ్యంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలన్నీ వైరస్ ధాటికి కుదేలవుతున్నాయి. కొవిడ్‌ను కట్టడి చేయలేక చతికిలపడ్డాయి. కానీ, కేవలం 50 లక్షల జనాభా ఉన్న అతి చిన్న దేశం న్యూజిలాండ్ మాత్రం కరోనాను విజయవంతంగా అరికట్టింది. మహమ్మారిపై విజయం సాధించిన మరో 8 దేశాల సరసన చేరింది.
మే 29 నుంచి న్యూజిలాండ్‌లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. జూన్ 9 నాటికి బాధితులంతా కోలుకోవడం వల్ల ఆ దేశం 'కొవిడ్-ఫ్రీ కంట్రీ'గా అవతరించింది.
న్యూజిలాండ్ యువ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అయితే ఏకంగా డ్యాన్స్ చేస్తూ ఈ విజయాన్ని ఆస్వాదించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. దేశీయ ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే కార్యక్రమాలకు సైతం అనుమతులిచ్చారు. సరిహద్దు ఆంక్షలను కొనసాగిస్తున్నారు. త్వరలో ఆస్ట్రేలియా సహా పసిఫిక్ దేశాలకు విమాన ప్రయాణాలను త్వరలోనే అనుతించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కట్టడికి కారణమిదే..
దేశదేశాలన్నీ వైరస్‌ను నియంత్రించలేక వెనకబడిపోతుంటే న్యూజిలాండ్ మాత్రం ఎలా ఈ ఘనత సాధించగలిగిందన్నది చాలా మంది అనుమానం. ముందస్తు హెచ్చరికలు, స్పష్టమైన సందేశాలు జారీ చేయడం, ప్రధాని పట్ల ప్రజలకున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశీ చెప్పుకొచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో ఆక్లాండ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్‌లో కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలు, పాటించిన విధానాలపై పలు విషయాలు వెల్లడించారు.
న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు మొత్తం 1504 కరోనా కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా నివారణలో దేశ పరిణామం, జన సాంద్రత న్యూజిలాండ్‌కు కలిసొచ్చినట్లు పేర్కొన్నారు పర్దేశీ. 50 లక్షల వరకు జనాభా ఉన్నప్పటికీ.. దేశ భౌగోళిక పరిణామం విశాలంగా ఉంటుందని.. ప్రజలను దూరంగా ఉంచడం, స్వీయ నిర్బంధం పాటించేలా చేయడం తేలిక అని వెల్లడించారు. కేసులు తక్కువగా ఉండటం వల్ల కట్టడి చేయడం సులువైందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల నుంచి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు.
ముందస్తు అప్రమత్తత
వైరస్ వ్యాపించిన తొలినాళ్లలోనే న్యూజిలాండ్ అప్రమత్తమైనట్లు తెలిపారు పర్దేశీ. నాలుగు దశల వైద్య హెచ్చరిక వ్యవస్థను ఆచరణాత్మకంగా అభివృద్ధి చేయగలిగారని పేర్కొన్నారు. మార్చి 20న తొలి దశ హెచ్చరిక జారీ చేయగా.. మూడు నాలుగు రోజుల్లోనే నాలుగో దశకు చేరుకున్నట్లు స్పష్టం చేశారు. నాలుగోది అత్యున్నత దశ అని తెలిపారు.
"అప్పటికే దేశంలో నమోదైన కేసులు చాలా వరకు ఇరాన్, చైనా వంటి విదేశాల నుంచే వచ్చినవని గ్రహించి... సరిహద్దులు(వాయుమార్గం) మూసేశారు. వైద్య హెచ్చరికలను జారీ చేసే ముందే ప్రజలకు వాటి గురించి పూర్తి అవగాహన కల్పించేలా ప్రధాని జెసిండా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజలు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు."
-ముక్తేశ్ పర్దేశీ, న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్
ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా సహకరించారని, ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలు అపారమైన విశ్వాసం ఉంచారని తెలిపారు పర్దేశీ. ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలు, స్పష్టమైన సందేశం అందించడం వంటి అంశాలు న్యూజిలాండ్ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంకా సాధారణం కాలేదు
ప్రస్తుతం దేశంలో ఒకటో వైద్య హెచ్చరిక దశ కొనసాగుతోందని, అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణంగా మారలేదని పేర్కొన్నారు పర్దేశీ. విదేశీయులను దేశంలోకి అనుమతించడం లేదని, ఇతర దేశాల్లో ఉన్న పౌరులను మాత్రమే న్యూజిలాండ్‌కు అనుమతిస్తున్నట్లు చెప్పారు. వీరు తిరిగొచ్చిన తర్వాత 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేలా అక్కటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.