తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ- పాక్‌ మైత్రికి బీటలు..కశ్మీర్‌ అంశమే కారణం!

పాకిస్థాన్​, సౌదీ అరేబియా మధ్య బంధాలు తెగిపోతున్నాయి. మొన్నటి వరకు మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి ఇతర అంశాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్న ప్రధాన కారణం కశ్మీర్‌ అని నిపుణులు చెబుతున్నారు. కశ్మీర్​ విషయంలో మద్దతుగా ఉండాలని పాక్​ పదే పదే కోరడం సౌదీకి నచ్చలేదు. అది చాలదన్నట్లు పాక్​ నేరుగా విమర్శలు చేస్తోంది. ఆ దెబ్బతో అసలే అంతంత మాత్రంగా మారిన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

clashes-beween-pak-and-saudhi
సౌదీ- పాక్‌ మైత్రికి బీటలు..కశ్మీర్‌ అంశమే కారణం!

By

Published : Aug 13, 2020, 5:06 AM IST

సౌదీఅరేబియా, పాకిస్థాన్‌ నిన్న మొన్నటి వరకు మిత్రదేశాలు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ బంధాలన్నీ తెగదెంపులు అవుతున్నాయి. ఇందుకు కారణం కశ్మీర్‌ అంశమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి ఇతర అంశాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్న ప్రధాన కారణం కశ్మీర్‌. ఈ విషయంలో తనకంటూ సొంత వైఖరి కలిగిన సౌదీని తనకు మద్దతుగా మాట్లాడాలని పాక్‌ పదేపదే కోరడం నచ్చలేదు. అది చాలదన్నట్లు సౌదీపైనే నేరుగా విమర్శలకు దిగింది దాయాది పాకిస్థాన్‌. ఆ దెబ్బతో అసలే అంతంత మాత్రంగా మారిన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇంకా తెగే వరకు లాగుతురా? లేదా ఇక్కడితో ఆపేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.

భారత్‌, పాక్‌ మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం కశ్మీర్‌. కానీ ఆ అంశం రెండు ఇస్లామిక్‌ దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టే స్థాయికి తీసుకువెళ్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కశ్మీర్‌ అంతర్గత విషయం అని భారత్ చెబుతున్నా దాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు ఎప్పటి నుంచో పాకిస్థాన్‌ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. ఎప్పుడైతే 370 అధికరణ రద్దు చేసి దిల్లీ నాయకత్వం జమ్ము, కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిందో అప్పటి నుంచి పాక్‌ వెర్రి రంకెలు వేస్తోంది. దీనిపై నానాయాగి చేసి ప్రపంచ దేశాల దృష్టి తన వైపు మళ్లించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ చైనా, టర్కీ, మలేషియా లాంటి కొన్ని దేశాలు మినహా పాక్‌ అరుపుల్ని ఎవరూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ వేదికలపై తన పాచిక పారకపోవడంతో ఇస్లామిక్‌ దేశాలను ఈ వివాదంలోకి లాగాలని పాక్‌ ప్రయత్నిస్తోంది. అందుకోసం 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్ కార్పొరేషన్‌ (ఓఐసీ) మద్దతు పొందాలని భావించింది. ఓఐసీలో సభ్యత్వం కలిగి ఉన్న సౌదీని కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు సభ్యదేశాల్ని సమావేశపరచాలని ఫిబ్రవరిలో కోరింది. కానీ దీన్ని సౌదీ పట్టించుకోలేదు. ఆ తిరస్కారంతో మరింత భంగపడిన పాక్‌ సౌదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి బహిరంగంగానే సౌదీని విమర్శించారు. వారు ముందుకు రాకపోతే కశ్మీర్‌ అంశంపై తమతో కలిసివచ్చే ముస్లిం దేశాలతో తామే సమావేశాన్ని నిర్వహిస్తామని ఓ విధంగా హెచ్చరిక స్వరంలో చెప్పారు.

ప్రయత్నాలు విఫలం..

కశ్మీర్‌ అంశంపై ముస్లిం దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్ల ప్రధాని ఇమ్రాన్‌ కూడా సౌదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ముస్లిం దేశాల్లోనే విభజన ఉండటం వల్ల అనుకున్నది సాధించలేకపోయామని, ఓఐసీ సమావేశం సభ్యదేశాలు కలిసి రాలేదని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. అది సౌదీకి ఆగ్రహం తెప్పించింది. పాక్ తీరుపై సౌదీ యువరాజు సాల్మాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దశాబ్దాల తరబడి నెలకొన్న స్నేహానికి బీటలు వారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చివరికి ఈ విషయం పాక్‌కు సౌదీ చమురు సరఫరా నిలిపివేసే వరకు వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సౌదీ నుంచి అప్పుగా తీసుకున్న 3 బిలియన్‌ అమెరికా డాలర్లలో ఒక బిలియన్‌ను గతవారం పాక్‌ తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. తీర్చడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ సౌదీ ఒత్తిడి మేరకు వెంటనే చెల్లించినట్లు తెలుస్తోంది.

చైనా నుంచి నిధులు అందిన వెంటనే మిగతా రుణం కూడా చెల్లించే ఆలోచనలో ఉంది పాక్‌. సౌదీకి పాకిస్థాన్‌ మొత్తం 6.2 బిలియన్‌ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఇందులో భాగంగానే సౌదీ నుంచి రాయితీ ధరకు చమురు పొందే ఒప్పందం ఇటీవల ముగిసింది. దీన్ని మరో రెండేళ్లకు పొడిగించే అవకాశం ఉన్నా ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ఈ దిశగా చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య బంధం ముగిసినట్లే అని మిడిల్‌ ఈస్ట్‌ మానిటర్‌ అనే పత్రిక పేర్కొంది. 2018 నవంబరులో పాక్‌కు 6.2 బిలియన్‌ డాలర్ల మేర రుణం ఇస్తున్నట్లు సౌదీ పేర్కొంది. ఇందులో 3.2 బిలియన్‌ డాలర్లు చమురు సరఫరాకు సంబంధించింది కాగా, మరో 3 బిలియన్‌ డాలర్లు సాధారణ రుణాలకు సంబంధించినవి. గతేడాది ఫిబ్రవరిలో సౌదీ రాజు పాక్‌ పర్యటన సందర్భంగా మరో 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రస్తుత సౌదీ రాజు యువకుడైనందు వల్ల ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే ఈ ఒప్పందాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అలా జరిగితే పాక్​కు ఎక్కువ నష్టం..

రెండు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా మారిన తరుణంలో సౌదీకి ఉన్నతస్థాయి బృందాన్ని పంపించి పరిస్థితుల్ని చక్కబెట్టే అవకాశం ఉందని పాక్‌కు చెందిన కొందరు పరిశీలకులు అంటున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో సౌదీ కనుక తమ దేశంలో పాక్‌ కార్మికుల స్థానంలో బంగ్లాదేశీయుల్ని నియమించుకుంటామంటే పాకిస్థాన్‌ పెద్దఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. గతంలో సౌదీ ఓసారి అలా హెచ్చరించింది. సౌదీ ఇతర పాలకుల్లా కాక ప్రస్తుత రాజు సాల్మాన్‌ చాలా భిన్నమైన వ్యక్తి అని, ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించకపోతే పాకిస్థాన్‌కే నష్టం అని విశ్లేషకులు అంటున్నారు. ఓఐసీలో సౌదీ ఆధిపత్యానికి ప్రస్తుతానికి తిరుగులేదు. ఆ హోదాను వేలెత్తి చూపినట్లుగా చేసిన పాక్‌ వైఖరి ఇప్పుడు వారికే ఇబ్బందిగా మారింది. సౌదీ అంగీకరించకపోతే తామే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా సౌదీకి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇరాన్‌, టర్కీ, ఖతార్‌, మలేషియాతో కలిసి మరో ఇస్లామిక్‌ దేశాల కూటమిని ఏర్పాటు చేయాలన్నది పాక్‌ యోచన. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మలేషియాలో అత్యంత బలమైన నేతగా రూపొందిన మహతీర్ మహమ్మద్‌ పదవి నుంచి దిగిపోవడంతో ఆ ఆలోచన అక్కడే ఆగిపోయింది. మరోవైపు పాక్‌లోని గ్వాదర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చిన సౌదీ ఆ దేశ వైఖరి కారణంగా వెనక్కి తగ్గింది. దీని వెనక అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కూడా ఓ కారణమే అని చెబుతున్నారు నిపుణులు. అమెరికాతో సన్నిహితంగా ఉండే సౌదీ.. చైనాతో పాక్‌ మితృత్వంపై అసంతృప్తిగా ఉంది.

గల్ఫ్‌ దేశాలతో భారత్‌ సన్నిహిత సంబంధాలు కూడా ప్రస్తుత పరిణామాల్లో కీలకం కానున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. భారత్‌, సౌదీ, యూఏఈల మధ్య మంచి ఆర్థిక సంబంధాలే ఉన్నాయి. అయితే భద్రతా, రక్షణపరమైన అవసరాలు ఈ దేశాలను మరింత దగ్గరగా చేర్చాయి. మరోవైపు తమ అప్పు తీర్చడానికి పాక్‌.. చైనా నుంచి రుణం తీసుకోవడం సౌదీకి నచ్చలేదు. ఎటు నుంచి చూసినా పాక్‌ తీరుపై సౌదీ అసంతృప్తిగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశం వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. ఆర్థికపరంగా పాక్‌ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయాల్లో సౌదీతో కోరి కయ్యానికి దిగడం వల్ల పాక్‌కే నష్టం అని పరిశీలకులు అంటున్నారు. సౌదీపై బహిరంగ విమర్శలు చేసిన ఖురేషి విషయంలో పాక్‌లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇమ్రాన్‌కు ప్రత్యామ్నాయం తానే అని అనిపించుకోవడానికి ఆయన అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. నిజానికి సౌదీతో పాకిస్థాన్‌ ఎప్పుడూ గొడవ పెట్టుకోలేదు. కశ్మీర్‌ విషయంలోనే ఎవరూ మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఇలా అక్కసు వెళ్లగక్కినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భారత్‌ సౌదీ బంధం బలపడటం పాక్‌లో అగ్గిని రగిల్చినట్లయింది. ఈ పరిస్థితుల్లో ఇస్లామిక్‌ దేశాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న విన్నపాన్ని సౌదీ తోసిపుచ్చడంతో పాక్‌ నొచ్చుకుంది. దీంతో సౌదీ ఆధిపత్యాన్ని ప్రశ్నించే సాహసం చేసి ఇప్పుడు పర్యవసనాలు అనుభవిస్తోంది.

ఇదీ చూడండి: 'అమెరికా... నిప్పుతో గేమ్స్‌ వద్దు'

ABOUT THE AUTHOR

...view details