2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించడంలో రష్యా ప్రమేయం ఉందన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఈ విషయంపై అగ్రరాజ్యంలో రాజకీయంగా పెను దుమారం రేగింది. తమ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని సహించబోమని ట్రంప్ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి చెందిన రష్యా గూఢచారి పలు విషయాలు తెలియజేసినట్లు వస్తున్న కథనాలు సంచలనం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని ఆ గూఢచారి తెలియజేశాడన్నది కథనం సారాంశం. అత్యంత సున్నితమైనది కావడం వల్ల అప్పటి సీఐఏ డైరక్టర్ జాన్ ఒ. బ్రెన్నాన్ ఈ సమాచారాన్ని బయటకి రాకుండా గోప్యంగా ఉంచారట. ఈ సమాచారాన్ని పూర్తిగా సమీక్షించాల్సిందింగా సీఐఏ అధికారులను ఆదేశించారట. ఇది కచ్చితమైన సమాచారమా కాదా అన్న విషయంపై పూర్తి దర్యాప్తు జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.