న్యూజిలాండ్ ప్రార్థనా స్థలాలపై దాడిచేసి 51 మంది ప్రాణాలు బలిగొన్న ఘటనలో నిందితుడిపై న్యాయస్థానంలో మూడోరోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా మృతుల బంధువులు, క్షతగాత్రులు తమ సాక్ష్యాలను నమోదు చేసేందుకు క్రైస్ట్‌చర్చ్‌లోని కోర్టుకు హాజరయ్యారు.
మార్చి 15, 2019 నాటి భయానక ఘటనలో చనిపోయిన మూడు సంవత్సరాల చిన్నారి మక్కాద్ ఇబ్రహీం తండ్రి ఆడెన్ దిరియే కూడా వీరిలో ఉన్నారు. టారాంట్ చేసిన మారణకాండను తను ఎన్నటికీ క్షమించనని.. అతని కోసం మరింత కఠిన శిక్ష (మరణానంతరం) వేచి ఉందని దిరియే ఆక్రోశం వ్యక్తం చేశారు. బ్రెంటన్ టారాంట్ తన కుమారుడినే కాకుండా పూర్తి న్యూజిలాండ్‌నే హతమార్చినట్టని అయన అభిప్రాయపడ్డారు. "నువ్వు అనుకున్నట్టుగా నీ దుర్మార్గం, ద్వేషం నెగ్గలేదు. దానికి బదులుగా క్రైస్ట్‌చర్చ్ సమాజం మొత్తం ఏకమైంది. మేమందరం కలిసి శాంతియుతమైన దేశాన్ని మళ్లీ సృష్టించుకుంటాం." అని ఆయన నిందితుడిని ఉద్దేశించి అన్నారు.