తెలంగాణ

telangana

ETV Bharat / international

'కాలికి నొప్పని వెళితే.. 'ఆమె' అతడని తేలింది!' - లైంగిక విద్యఆవశ్యకత

చాలా ఏళ్లుగా ఆమెకు పిల్లలు కలగడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దంపతులకు నిరాశే ఎదురైంది. అయితే కాలినొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు విస్తుపోయే​ విషయం తెలిసింది. ఆమెలో పురుషత్వం ఉందని తెలిసింది. కాలినొప్పికి.. ఆమె లైంగికత్వానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Chinese woman visits doctor for ankle problem, finds out she was born a male
'కాలికి నొప్పని వెళితే.. ఆమె.. అతడని తెేలింది'

By

Published : Mar 16, 2021, 8:00 PM IST

Updated : Mar 16, 2021, 10:11 PM IST

ఆమె చాలా ఏళ్లుగా కాలిమడిమ నొప్పితో బాధపడుతోంది. ఒకరోజు నొప్పి తీవ్రత భరించలేక ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు దిగ్భ్రాంతికర నిజం తెలిసింది. ఆమెకు క్యాన్సరో లేక వేరే వ్యాధేమన్న వచ్చిందనుకుంటున్నారా? కాదు. ఆమెలో అతడు ఉన్నాడని తెలిసింది. ఏంటి అర్థం కాలేదా? ఆమెలో పురుషత్వ లక్షణాలూ ఉన్నాయని తెలిసింది. లక్షణాలంటే పురుషప్రవర్తన, స్వరం కాదు. మరేంటి?

25 ఏళ్ల వయస్సుగల ఆ యువతిది చైనా. ఆమెకు పెళ్లైంది కానీ చాలా ఏళ్లుగా పిల్లలు లేరు. దంపతులిద్దరూ ఎంతో ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. ఆమెను మరో సమస్యా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఎప్పటినుంచో కాలిమడిమ నొప్పి వేధిస్తుంటే.. బాధ తట్టుకోలేక ఓ రోజు ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్​రే తీసిన వైద్యుడు ఆశ్చర్యపోయే విషయం చెప్పాడు. ఆమె యుక్తవయస్సు నుంచి కాలిమడిమ ఎదగలేదని తేల్చాడు. అనుమానమొచ్చి ఆమెను కాస్తలోతుగా ప్రశ్నించాడు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ఇంతవరకు తనకు రుతుక్రమం రాలేదని వైద్యునికి చెప్పింది. అంతేకాకుండా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను వివరించింది.

సాధారణ సమస్యే అనుకున్నారు..

టీనేజ్​లో ఉన్నప్పుడు కూతురుకు రుతుక్రమం రావట్లేదని.. ఆమె తల్లిదండ్రులు వైద్యున్ని సంప్రదించారు. పరీక్షించిన వైద్యుడు.. అమ్మాయిది మామూలు సమస్యేనని తోటి అమ్మాయిల లైంగిక ఎదుగుదలతో పోల్చితే ఈమె కొంచెం వెనకబడి ఉందని చెప్పాడు. కొన్నిరోజుల్లో సర్దుకుపోతుందని అన్నాడు. దాంతో ఇది సాధారణమే అనుకొని ఆ విషయం మర్చిపోయారు. కానీ రుతుక్రమం రాలేదు. ఆ విషయాన్నే ప్రస్తుత డాక్టరుకు చెప్పిందామె.

ఆమె+అతడు=కాంజెనిటల్​ అడ్రినల్​ హైపర్​ప్లేసియా

అయితే వైద్యుడు ఆమెకు మరిన్ని పరీక్షలు చేశాడు. రక్తపోటు ఎక్కువగా ఉందని, రక్తంలో పొటాషియం స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని నిర్ధరించాడు. కాం​జెనిటల్​ అడ్రినల్​ హైపర్​ప్లేసియా అనే వ్యాధి ఉన్నట్లు తేల్చాడు. ఈ వ్యాధి వల్ల లైంగికంగా ఎదుగుదల అస్తవ్యస్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఆమెకు గర్భాశయం, అండాలు కూడా లేవని తేల్చాడు. మరోషాకింగ్​ నిజం కూడా చెప్పాడు. మహిళల లైంగికత్వాన్ని నిర్ధరించేవి ఆమెలో లేవని.. బదులుగా మగవారిలో ఉండే క్రోమోజోమ్​ల జంట 46, ఎక్స్​వై ఉన్నట్లు తేల్చాడు. అప్పటివరకు ఆమె మహిళ కాదు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే ఆమెకు బాహ్యలైంగిక అవయవాలు మహిళకు సంబంధించినవే. కానీ క్రోమ్​జోమ్​లు మాత్రం మగవారివి. దాంతో ఆమెలో అతడు కూడా ఉన్నాడని తెలిసింది. అయితే ఆమె 'పూర్తిగా పురుషుడు' అనడానికి లేదు. ఎందుకంటే పురుషులకు సంబంధించిన జననాంగాలు ఆమెలో లేవు. ఆమెలో సగంపురుషుడు, సగం మహిళ ఉన్నట్లు లెక్క.

'కారణం అదే'

అయితే దీనికి కారణం ఆమె తల్లిదండ్రులు దగ్గరి రక్త సంబంధీకులు కారణం కావొచ్చని వైద్యుడు తేల్చాడు. ఆమె యుక్తవయస్సులో ఉన్నప్పడు రుతుక్రమం రావట్లేదని తెలిసి సరైన వైద్యం చేయించని తల్లిదండ్రులు ఇందుకొక కారణం అని చెప్పాడు.

ఎటూ తేల్చుకోలేక..

బీపీ, పొటాషియం స్థాయిలు ఇప్పుడు ఆమెలో సాధారణస్థాయిలో ఉన్నాయని వైద్యుడు చెప్పాడు. అయినా తాను మహిళగా ఉండాలా? పురుషునిగా ఉండాలా అనేది ఆమె ఇంకా తేల్చుకోలేకపోతోంది. కొత్తగా తనలో పురుష లక్షణాలున్నాయని తెలిసి అందుకు అనుగుణంగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుందని మానసిక వైద్యులు హూ షావోహు అన్నారు. అంతేకాకుండా ఇది చాలా నొప్పిని కలిగించే ప్రక్రియని తెలిపారు.

లైంగిక విద్య ఆవశ్యకత..

మేనరికం, రక్తసంబంధీకుల మధ్య పెళ్లి ఇలాంటి అనర్థాలకు దారీతీస్తుందన్న లైంగిక పరిజ్ఞానం ఆమె తల్లిదండ్రులకు లేకపోవడం సమస్యను ఇక్కడిదాకా తెచ్చిందని అన్నారు. చైనాలో లైంగిక విద్య ఆవశ్యకతను ఈ సంఘటన నొక్కి చెబుతోందని పేర్కొన్నారు. అయితే పాఠశాలలో వయస్సువారీగా లైంగిక విద్యను అందించాలని చైనా ఇటీవలే చట్టం కూడా తెచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా(సమస్యకు మూలం మేనరికం, రక్త సంబంధీకుల మధ్య వివాహం) చట్టం ఏమేరకు ఆపుతుందో చూడాలి.

ఇదీ చదవండి:ఆస్ట్రాజెనెకా టీకాపై నిషేధం ఎందుకు?

Last Updated : Mar 16, 2021, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details