చైనాకు చెందిన ఓ మహిళ గత 40 ఏళ్లలో ఒక్కసారి కూడా నిద్రపోలేదని పేర్కొంది. నాలుగు దశాబ్దాలుగా నిద్రంటే ఏంటో తెలియదని.. అయినప్పటికీ అలసటగా అనిపించట్లేదని తెలిపింది.
హెనాన్ ప్రావిన్స్ జాంగ్‌మౌ కౌంటీలోని ఓ గ్రామానికి చెందిన లీ-జాన్ఇంగ్ అనే మహిళ 40 ఏళ్లు నిద్రపోవడం లేదు. ఈ విషయాన్ని ఆమె భర్త, ఇరుగుపొరుగు వారు సైతం ధ్రువీకరించడం విశేషం. తాను చివరిసారి 5-6 సంవత్సరాల వయస్సులో నిద్రపోవడం గుర్తుందని.. గడచిన 40 ఏళ్లలో ఒక్కసారి కూడా నిద్ర పోలేదని లీ పేర్కొంది. ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు సాధారణ మనుషుల్లా ఆమె నిద్ర పోకపోవడానికి కారణాలేంటి అని తెలుసుకోవడానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
లీ-జాన్ఇంగ్ భర్త లియు సుక్విన్ కూడా తన భార్యకు ఎలాంటి నిద్ర అవసరం లేదని చెప్పారు.
"మా వివాహం జరిగినప్పటి నుంచి నా భార్య రాత్రి-పగలు మేల్కొనే ఉంటోంది. ఆమెకు నిద్ర పట్టడం లేదని చెబుతూనే ఉంది. ఆమెకోసం కొన్ని నిద్రమాత్రలు కూడా కొన్నా. కానీ లాభం లేదు."
-లీ జాన్ఇంగ్ భర్త లియు సుక్విన్
తాను చాలాసార్లు వైద్యుల్ని సంప్రదించినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని లీ-జాన్ఇంగ్ తెలిపింది. అయితే ఇటీవల బీజింగ్ ఆసుపత్రి వైద్యులు మాత్రం ఆమె నిద్ర లేమికి గల రహస్యాన్ని ఛేదించారు. ఆ మహిళను 48 గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉంచిన వైద్యబృందం.. అధునాతన సెన్సార్‌లను ఉపయోగించి ఆమె మెదడులోని సమాచారాన్ని సేకరించారు. ఆమె శరీరం, మెదడు విశ్రాంతి తీసుకునే విధానం అసాధారణంగా ఉంటుందని.. ఈ కారణంగానే 40 ఏళ్లుగా నిద్రపోలేదని ఆమె నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.