తెలంగాణ

telangana

ETV Bharat / international

సరిహద్దుల్లో చైనా దుడుకుతనం ..! - china in ladakh news

చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది.

chinese troops
చైనా

By

Published : Jul 22, 2021, 12:15 AM IST

Updated : Jul 22, 2021, 5:31 AM IST

సరిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. జిత్తులమారి డ్రాగన్‌ సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన సుమారు 40 దళాలు ఇటీవల బారాహోటి ప్రాంతంలో ఎల్‌ఏసీకి ఆవల గస్తీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

డ్రోన్లు ప్రయోగం..

ఇటీవలి కాలంలో ఎల్‌ఏసీ వెంబడి వెలుగుచూసిన పరిణామాల నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో అక్కడి సెంట్రల్‌ సెక్టార్‌లో చైనా తన సైనిక కార్యకలాపాలను మరింత పెంచవచ్చని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. బారాహోటి సమీపంలోని తమ వైమానిక స్థావరం వద్ద కూడా సైనిక కార్యకలాపాలను చైనా పెంచినట్లు తెలిపాయి. అక్కడి నుంచే డ్రోన్లు, హెలికాప్టర్లను డ్రాగన్‌ సైన్యం ప్రయోగిస్తున్నట్లు వివరించాయి. బారాహోటిని తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా పలుమార్లు అక్కడ అతిక్రమణలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌ మాదిరి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు గతేడాది ఇదే సెక్టార్‌లో భారత సైన్యం తమ దళాలను మోహరించింది. సెంట్రల్‌ సెక్టార్‌లోనూ అదరపు బలగాలను మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సెంట్రల్‌ సెక్టార్ వద్ద భద్రతా ఏర్పాట్లను భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, సెంట్రల్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వై దిమ్రి ఇటీవల సమీక్షించారు. తూర్పు లద్దాఖ్‌లోని పలు వివాదాస్పద ప్రాంతాల వద్ద గతేడాది మే ఆరంభం నుంచి భారత్‌, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన నెలకొంది.

దశలవారీగా నిర్వహించిన సైనిక, దౌత్యపరమైన చర్చల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల వెంబడి ఇరు పక్షాలు తమ సైన్యాన్ని వెనక్కు రప్పించాయి. మరికొన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి.

ఇదీ చదవండి:China: సరిహద్దుల్లో డ్రాగన్‌ 'రెక్కల' చప్పుడు

Last Updated : Jul 22, 2021, 5:31 AM IST

ABOUT THE AUTHOR

...view details