తెలంగాణ

telangana

ETV Bharat / international

'వ్యాపారాలపై ట్రంప్ సర్కారు రాజకీయం చేస్తోంది' - china 33 companies

అమెరికా ప్రభుత్వం తమ సంస్థలకు ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని చైనా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంక్షలు విధించడం ద్వారా ట్రంప్ సర్కారు.. వ్యాపారాన్ని రాజకీయంగా మార్చుతోందని ఆరోపించాయి.

china
చైనా

By

Published : May 25, 2020, 4:22 PM IST

తమ ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ చైనాకు చెందిన కంపెనీలు అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సర్కారు రాజకీయం చేస్తోందని ఆరోపించాయి.

అమెరికా చర్యలు.. బాధ్యతారాహిత్యమైనవి అని, వ్యాపారం-శాస్త్రీయ సాంకేతికత పరిశోధనాభివృద్ధిని రాజకీయంగా మార్చుతున్నాయని చైనా టెక్ దిగ్గజం 'కిహూ 360' విమర్శించింది.

మరో సంస్థ.. క్లౌడ్​మైండ్స్ టెక్నాలజీ సైతం ఈ విషయంపై స్పందించింది. తమ ఉత్పత్తులన్నీ ప్రజల కోసం ఉద్దేశించినవేనని కంపెనీ స్పష్టం చేసింది. ఈ అసమంజసమైన ప్రక్రియను నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

అయితే ఏయే సాంకేతికతలు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, ఈ ఆంక్షలు ఏ విధంగా ప్రభావం చూపుతాయన్న విషయాన్ని చైనా కంపెనీలు వెల్లడించలేదు. మరోవైపు ఈ విషయంపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.

ఆంక్షలు విధిస్తే?

ప్రాసెసర్లు, సాఫ్ట్​వేర్లు, హార్డ్​వేర్ విభాగాలు, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలు వంటి ఉత్పత్తులను చైనాలోని దిగ్గజ సాంకేతిక సంస్థలు తయారు చేస్తూ ఉంటాయి. వీటి తయారీకి ఎక్కువ శాతం అమెరికా, ఐరోపా, జపాన్ దేశాలకు చెందిన సాంకేతికతను ఉపయోగించాల్సి వస్తోంది.

ఇప్పటికే చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​... ఆ దేశ కంపెనీల విశ్వసనీయతపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతికత ఉపయోగించుకొని అమెరికాతో పాటు ఆసియా దేశాలకు భద్రతా పరంగా విఘాతం కలిగించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యాంటీ వైరస్ సాఫ్ట్​వేర్​, వెబ్​ బ్రౌజర్లను తయారు చేసే కిహూ 360 సహా మరో 33 సంస్థలపైనా తాజాగా ఆంక్షలు విధించింది అమెరికా. 'చైనా మిలిటరీకి ఉత్పత్తుల సేకరణ కోసం సహకరిస్తూ తీవ్ర భద్రతాపరమైన ముప్పు ఉన్న కంపెనీల జాబితా'లోకి ఈ సంస్థలను చేర్చుతూ అమెరికా వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

దీంతో చైనా కంపెనీలకు.. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి విడిభాగాలు, సాంకేతికతను పొందే వీలు లేకుండా పోయింది.

ABOUT THE AUTHOR

...view details