తూర్పు లద్దాఖ్‌లో మోహరించిన తమ సైనికులు చలిని తట్టుకునేందుకు అత్యాధునిక పరికరాలను అందించినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. సైనికులు స్వయంగా నిర్మించుకోగలిగే డిస్మౌంటెబుల్ సెల్ఫ్ ఎనర్జైస్డ్ ఇన్సులేటెడ్ క్యాబిన్లను సమకూర్చినట్లు తెలిపింది. 5 వేల మీటర్ల ఎత్తులో.. బయట మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. ఈ క్యాబిన్లలో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉండేలా రూపొందించినట్లు చెప్పింది.
ఓ ఆన్లైన్ సమావేశంలో మాట్లాడిన చైనా రక్షణ శాఖ ప్రతినిధి వూ కువాన్.. లద్దాఖ్‌లో తమ సైనికులకు అందిస్తున్న సదుపాయాల గురించి వివరించారు. వ్యక్తిగత స్లీపింగ్ బ్యాగులు, శిక్షణ కోట్లు, చలిని తట్టుకొనే బూట్లను సైనికుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఇవన్నీ పర్వత ప్రాంతాల్లో అధిక చలిని నిలువరించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. తాజా పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు మానవ రహిత విమానా(యూఏవీ)లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇది సైనికుల యుద్ధ సన్నద్ధతను పెంచుతుందని అన్నారు.