కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతున్నా ఆ దేశ శాస్త్రవేత్తలు మాత్రం అంగీకరించడం లేదు. కరోనా కేసులను మొదటగా వుహాన్‌లో గుర్తించినంత మాత్రాన.. వైరస్ చైనాలో ఉద్భవించినట్లు కాదని పేర్కొన్నారు. కరోనా జన్యు పరివర్తనంలో అతి తక్కువ మార్పులు కన్పిస్తున్న ఆసియా దేశాలు భారత్ లేదా బంగ్లాదేశ్‌లోనే కరోనా మూలాలు ఉండొచ్చని చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని 'ద అర్లీ క్రిప్టిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సార్స్ కోవ్-2 ఇన్ హ్యూమన్ హోస్ట్స్' పేరుతో విడుదల చేశారు చైనా శాస్త్రవేత్తలు. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌కు చెందిన ప్లాట్‌ఫాం 'SSRN.Com' వెబ్సైట్ దీన్ని ప్రచురించింది.
దాదాపు 17 దేశాల్లోని కరోనా వైరస్ జన్యుక్రమాలపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నివేదికను రూపొందించినట్లు చైనా పరిశోధకులు పేర్కొన్నారు. ఫిలోజెనెటిక్ విశ్లేషణ పద్ధతిలో కరోనా మూలాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు.
ఆ దేశాల నుంచే వ్యాప్తి..
ఈ విశ్లేషణ ప్రకారం వుహాన్‌లో కరోనా పుట్టలేదని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఇటలీ, చెక్ రిపబ్లిక్, రష్యా, సెర్బియా దేశాల నుంచే కరోనా వ్యాప్తి మొదలై ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.