అమెరికా- చైనా మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా.. తమ సైనిక లక్ష్యాలపై అమెరికా రూపొందించిన నివేదికను చైనా తప్పుబట్టింది. తమ వల్ల ప్రపంచానికి ఎలాంటి నష్టంలేదని.. వాస్తవానికి అమెరికానే అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఆరోపించింది. అగ్రరాజ్యం వల్ల ప్రపంచ శాంతికి ముప్పుపొంచి ఉందని ఆరోపించింది.
చైనా సైనిక ఆశయాలు.. తమ దేశ జాతీయ భద్రతకు, అంతర్జాతీయ నిబంధనలకు తీవ్ర ప్రమాదమని.. కాంగ్రెస్కు సమర్పించిన నివేదికలో అగ్రరాజ్య రక్షణశాఖ పేర్కొంది. ఈ నివేదికతో తమపై అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడింది చైనా.
"అమెరికా అనిశ్చితిని సృష్టిస్తుంది, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది, ప్రపంచ శాంతిని నాశనం చేస్తుంది. వీటికి ఎన్నో ఆధారాలున్నాయి. ఇరాక్, సిరియా, లిబియాతో పాటు అనేక దేశాల్లో అమెరికా చర్యల వల్ల 8 లక్షల మందికిపైగా మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. తమను తాము పరిశీలించుకోకుండా.. చైనాపై తప్పుడు నివేదికలను రూపొందించింది అగ్రరాజ్యం. అసత్య ఆరోపణలు చేయడం మాని.. చైనా సైన్యాన్ని హేతుబద్ధంగా చూడాలని అమెరికాకు సూచిస్తున్నాం. ఇరు దేశాల ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం."