Chinese Man Bitten by Venomous Snake: మూత బిగించి ఉన్న వైన్ సీసాలో ఏడాదిపాటు పాము బతికే ఉంటుందా? బాటిల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక్కసారిగా బయటకు వచ్చి కాటేస్తుందా? అవుననే అంటున్నాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. తన కుమారుడి చికిత్స కోసం కొనుగోలు చేసిన స్నేక్ వైన్ సీసాల విషయంలో ఇలానే జరిగిందని చెబుతున్నాడు.
ఏంటీ స్నేక్ వైన్?: చైనా సంప్రదాయ వైద్యంలో స్నేక్ వైన్ ఎంతో ప్రాచుర్యం పొందింది. దీని తయారీ కోసం.. వైన్‌ను ఓ సీసా లేదా జార్లో పోసి, అందులో ఓ విషపూరిత సర్పాన్ని పెడతారు. మూతపెట్టి, అనేక నెలలపాటు అలానే వదిలేస్తారు. అలా చేస్తే.. ఆ వైన్ ఔషధంలా మారుతుందని.. రుమాటిసం, ఆర్థరైటిస్, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నది చైనీయుల నమ్మకం. చైనా హీలాంగ్జియాంగ్కు చెందిన ఓ వ్యక్తి ఏడాది క్రితం మూడు స్నేక్ వైన్ జార్లు కొన్నాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడి కుమారుడి చికిత్స కోసం వాటిని ఉపయోగించాలన్నది అతడి ఆలోచన. అయితే.. కొన్న వెంటనే వాటిని తెరవలేదు. ఎక్కువకాలంపాటు వైన్లోనే పాము ఉంటే.. 'ఔషధ గుణాలు' మరింత బాగుంటాయని వాటిని అలానే వదిలేశాడు. ఇటీవల దాదాపు ఏడాది తర్వాత వాటిని తెరిచాడు. అయితే.. అనూహ్యంగా మూడు జార్లలోని పాములు బతికే ఉన్నాయని చెప్పాడు ఆ వ్యక్తి. వాటిలో ఒకటి తనను కాటేసిందని అన్నాడు. వెంటనే ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు చికిత్స అందించి తనను బతికించారని వివరించాడు.