నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిపై రాజీనామా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఆ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతోంది.
ఈ మేరకు ఓలిని గట్టెక్కించడానికి చైనా రాయబారి హౌ యాంకీ నేపాల్ కమ్యునిస్టు పార్టీ నేతలతో చర్చలు ముమ్మరం చేశారు. మాజీ ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనాల్ సహా గత 48 గంటల్లో పలువురు సీనియర్ నేతలను కలిశారు. మాధవ్ కుమార్, జలనాథ్లు చైనా రాయబారితో సమావేశమైన విషయాన్ని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.
ఖనాల్తో గురువారం 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలపై హౌ ఆందోళన వ్యక్తం చేశారు. విభేధాలను పరిష్కరించుకునే దిశగా పనిచేయాలని సూచించారు. ఎన్సీపీ నేత, మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్‌తో ఆదివారం సమావేశమయ్యారు హౌ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఆమెను అదేరోజు నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ సైతం ఆహ్వానించారు.
అధికారం కోసం పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి, ప్రధాని ఓలికి మధ్య అంతర్గతంగా అభిప్రాయభేదాలు పెరిగిపోయిన సమయంలో చైనా ఈ తరహా చర్చలు సాగించడం ఆసక్తికరంగా మారింది.
'మేం వ్యతిరేకం'
నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్ని చాలా మంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.
'రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రజాస్వామ్యం నేపాల్ ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందా?' అని నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత.. ప్రభుత్వాన్ని నిలదీశారు.
"ఈ రోజు కూడా మన దేశంలోని అంతర్గత రాజకీయాలను విదేశీ శక్తులు నడిపించే కుట్ర సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్వభౌమత్వం కలిగిన దేశంగా నేపాల్ తన నిర్ణయాలను స్వయంగా తీసుకోగలదు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధోరణిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం."