నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ)తో.. చైనా రాయబారి హౌ యాంకీ సమావేశమయ్యారు. ఖుమ్లతార్లోని ప్రచండ నివాసంలో వీరి భేటి జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ఇటీవల అధికార ఎన్సీపీలో చీలిక ఏర్పడటం, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపాల్‌లో చైనా రాయబారి పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో బీజింగ్ తలదూర్చటం ఇదేమీ కొత్త కాదని అక్కడి విద్యార్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ భేటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజింగ్ రాయబార కార్యాలయం ముందు చైనా వ్యతిరేక నినాదాలు చేశారు.