తెలంగాణ

telangana

ETV Bharat / international

'భయపెడుతోన్న మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రమాదకారి'

చైనా నుంచి వచ్చిన కరోనా మహమ్మారితోనే ప్రపంచ దేశాలు వణికిపోతుంటే మరో కొత్త రోగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా కజఖిస్థాన్‌లో మరో కొత్త వ్యాధి బయటపడినట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం తెలిపింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశంలోని చైనా పౌరుల్ని అప్రమత్తం చేసింది.

Chinese Embassy in Kazakhstan alerts its citizens following reports of unknown pneumonia
'అది.. కొవిడ్‌ కంటే ప్రమాదం'

By

Published : Jul 10, 2020, 5:24 PM IST

ఇప్పటికే కరోనాతో బెంబేలెత్తిపోతున్న ప్రపంచాన్ని రోజుకో కొత్త రోగం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కుదిపేస్తుండగానే.. కొత్తగా జీ-4, బ్యుబానిక్‌ ప్లేగు వంటివి ప్రజల్ని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా కజఖిస్థాన్‌లో మరో కొత్త వ్యాధి బయటపడ్డట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం తెలిపింది. జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశంలోని చైనా పౌరుల్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు గ్లోబల్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాల్లోకి వెళితే..

కజఖిస్థాన్‌లో గుర్తుతెలియని న్యుమోనియా వల్ల ఈ ఏడాది ఆరంభం నుంచి 1,772 మంది మరణించారు. ఇందులో 628 మంది ఒక్క జూన్‌లోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చైనా పౌరులు కూడా ఉన్నారు. ఈ మేరకు అక్కడి చైనా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వీచాట్‌ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త న్యుమోనియాతో బాధపడుతున్న వారిలో మరణాల రేటు కొవిడ్‌-19తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ కొత్త వ్యాధికి కొవిడ్‌-19తో పోలికలు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేనట్లు తెలుస్తోంది. కజఖ్‌ నుంచి చైనాలోకి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలని చైనాలోని ఆరోగ్య నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. చైనాకు చెందిన 'షిన్‌జియాంగ్‌ వీగర్‌' అనే స్వయంప్రతిపత్తి గల ప్రాంతం కజఖిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటోంది.

భిన్న వాదనలు..

అయితే, ఈ న్యూమోనియాను చైనా రాయబార కార్యాలయం గుర్తు తెలియనిదిగా పేర్కొనడానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. కజఖిస్థాన్‌ మాత్రం అధికారికంగా న్యుమోనియాగా మాత్రమే పేర్కొంటోంది. దీనికి సంబంధించి చైనా వద్ద ఇంకా ఏమైనా లోతైన ఆధారాలు ఉన్నాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారం ఇచ్చారా.. లేదా.. అన్న విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. కజఖ్‌లో ఉన్న చైనా పౌరులు అప్రమత్తంగా ఉండాలని.. కొత్త వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే రాయబార కార్యాలయం సూచించింది.

చైనాలో వస్తున్న మీడియా కథనాల ప్రకారం.. కజఖిస్థాన్‌లో కొత్త రకం న్యుమోనియాతో బాధపడుతున్నవారు కొవిడ్‌-19 సోకిన వారి కంటే రెండు నుంచి మూడింతలు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కిసికోవా బుధవారం ప్రకటించారు. రోజుకి 300 మంది న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరుతున్నారని కిసికోవా వెల్లడించినట్లు కజఖ్‌కు చెందిన వార్తా సంస్థ కజిన్‌ఫామ్‌ తెలిపింది.

చైనాలో అంతర్భాగం కావడానికి కజఖిస్థాన్‌ ఆసక్తిగా ఉందంటూ చైనాకు చెందిన ఓ వెబ్‌సైట్‌లో గత ఏప్రిల్‌లో వ్యాసం ప్రచురితమైంది. దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన కజఖ్‌ ప్రభుత్వం అక్కడి చైనా రాయబార కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి రాయబార కార్యాలయం నుంచి తాజా ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి:పాక్​ దారిలో చైనా- భారత్​తో ఇక పరోక్ష యుద్ధం!

ABOUT THE AUTHOR

...view details