వుహాన్‌లో కరోనావైరస్ తొలిదశలో ఉన్నప్పుడే గుర్తించిన హాంకాంగ్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్, సర్జన్, ప్రొఫెసర్ క్వాక్ యంగ్ యుయెన్.. చైనా బాగోతాన్ని బట్టబయలు చేశారు. వైరస్‌ను గుర్తించి దానిపై దర్యాప్తు చేసేందుకు వెళ్లగా.. అప్పటికే హువానాన్ జంతు మార్కెట్లోని భౌతిక ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని చెప్పారు.
ప్రముఖ వార్తా సంస్థ బీబీసీతో మాట్లాడిన ఆయన.. అప్పటికే గుర్తించిన క్లినికల్ ఆధారాలపై అధికారులు ఆలస్యంగా స్పందించారని పేర్కొన్నారు.
"మేం హువానన్ సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడేమీ లేదు. అప్పటికే పూర్తిగా శుభ్రం చేసి ఉంది. మార్కెట్ శుభ్రంగా ఉంది కాబట్టి క్రైం జరిగిన ప్రాంతం చెదిరిపోయిందని మీరు అనుకోవచ్చు. మనుషులకు వైరస్ వ్యాప్తి చేసే ఒక్క హోస్ట్‌ను కూడా మేం అక్కడ గుర్తించలేదు. అక్కడేదో కప్పిపుచ్చడానికి వుహాన్‌లోని స్థానిక అధికారులు ప్రయత్నించినట్లు నేను కూడా అనుమానిస్తున్నాను. సమాచారాన్ని వెంటనే పంపాల్సిన స్థానిక అధికారులు అలా జరిగేలా చేయలేదు."
-ప్రొఫెసర్ క్వాక్ యంగ్ యుయెన్, మైక్రోబయాలజిస్ట్, సర్జన్, ఫిజిషియన్
వైరస్ గురించి సమాచారాన్ని దాచిపెట్టినందుకు అమెరికా సహా చాలా దేశాలు.. చైనాను నిలదీస్తున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది. సమాచారాన్ని సరైన సమయంలోనే పంచుకున్నట్లు చెబుతోంది.