కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా చైనా తయారు చేసిన ఓ వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తోంది. 'బీబీఐబీపీ-కార్వీ' పేరిట తయారైన ఈ టీకా.. తొలి రెండు దశల హ్యూమన్ ట్రయల్స్‌లో సురక్షితమని తేలింది. ఈ వ్యాక్సిన్ పరిశోధనలకు సంబంధించిన వివరాలతో 'ద లాన్సెట్' జర్నల్ శుక్రవారం ఓ వ్యాసం ప్రచురించింది.
80 ఏళ్ల వారిలోనూ..
హ్యూమన్ ట్రయల్స్‌లో 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్నవారు పాల్గొన్నారు. వారందరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
"ఈ వ్యాక్సిన్ ద్వారా వృద్ధులను రక్షించాలన్నదే మా ధ్యేయం. ఎందుకంటే ఈ వయస్సు వారే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మిగతా వ్యాక్సిన్లు కాస్త తక్కువ ప్రభావం చూపుతున్నాయి. అయితే మేము తయారు చేసిన వ్యాక్సిన్ 60 ఏళ్లు పైబడిన వారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోంది. దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరం".
--జియామింగ్ యాంగ్, పరిశోధక బృందంలోని ప్రొఫెసర్
అధ్యయనంలో ఉపయోగించిన 'బీబీఐపీబీ-కార్వీ' వ్యాక్సిన్ చైనాలోని ఓ రోగి నుండి వేరుచేసిన వైరస్ నమూనా ఆధారంగా రూపొందించారు. సెల్ లైన్లను ఉపయోగించి ప్రయోగశాలలో వైరస్‌ను పెంచారు. తర్వాత 'బీటా-ప్రొప్రియానోలాక్టోన్' అనే రసాయనాన్ని ఉపయోగించి దాన్ని క్రియారహితం చేశారు. క్రియారహిత వైరస్‌తో పాటు అల్యూమినియం, హైడ్రాక్సైడ్‌ను కలిపి ఈ వ్యాక్సిను రూపొందించారు(అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది సహాయకారిగా పనిచేసి రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది).