వందేళ్ల ఆవిర్భావ వేడుకలను చైనా కమ్యునిస్టు పార్టీ ఘనంగా జరుపుకుంటోంది. పాఠశాలల్లో వ్యాసరచన పోటీల నుంచి దేశభక్తి ఉట్టిపడే చిత్రాల నిర్మాణం వరకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత శతాబ్ద కాలంలో చైనా ప్రజలు కలలుగన్న దేశాన్ని సాధించినట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ పేర్కొంది.
ప్రపంచశక్తిగా...
1921లో చైనా కమ్యునిస్టు పార్టీ ఏర్పాటైంది. అంతర్జాతీయ స్థాయిలో బలం లేకపోవడం, ప్రపంచ యుద్ధాలు, దేశంలో తీవ్ర పేదరికం వంటి పరిస్థితుల మధ్య పార్టీ పురుడుపోసుకుంది. అందుకు పూర్తి విరుద్ధంగా 2021 నాటికి ప్రపంచ శక్తిగా ఎదిగింది డ్రాగన్. ఐరాసలో శాశ్వత సభ్యత్వం పొందింది. అగ్రరాజ్యంగా పరిగణించే అమెరికాను తలదన్నే స్థాయికి చేరింది. అణ్వాయుధ శక్తి సంపాదించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.