భారత్‌లో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న తరుణంలో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కార్గో సర్వీసులను భారత్‌కు 15 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా చైనా నుంచి భారత్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఔషధాలు చేరవేయడంలో ప్రైవేటు వాణిజ్యదారులు చేస్తున్న కృషికి అంతరాయం కలగనుంది. అయితే.. అంతకుమందు కరోనాపై పోరాటంలో భారత్‌కు తాము సహాయ, సహకారాలను అందిస్తామని చైనా ప్రకటించడం గమనార్హం.
చైనా నుంచి భారత్‌కు నడిచే ఆరు రూట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ.. సేల్స్ ఏజెంట్లకు సిచువాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ సోమవారం లేఖ రాసింది.
" భారత్‌లో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో.. మన దేశంలో కేసులు పెరగకూడదనే ఉద్దేశంతో.. 15 రోజుల పాటు కార్గో విమానాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సిచువాన్ ఎయిర్‌లైన్స్‌కు భారత్ మార్గం అత్యంత వ్యూహాత్మకమైనది. ఈ రద్దు నిర్ణయం ద్వారా మన సంస్థకు తీరని నష్టం ఎదురువుతుంది. అందుకు మేం క్షమాపణలు కోరుతున్నాం."