తెలంగాణ

telangana

ETV Bharat / international

27 ఏళ్ల కనిష్ఠానికి చైనా ఆర్థిక వృద్ధి రేటు - china latest news

చైనా ఆర్థిక వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. దేశ వృద్ధి రేటు జులై-సెప్టెంబర్​ మూడో త్రైమాసికంలో 6 శాతంగా నమోదైనట్లు నేషనల్​ బ్యూరో ఆఫ్​ స్టాటిస్టిక్స్​ పేర్కొంది. దేశీయ డిమాండ్​ తగ్గుదల, అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా వృద్ధి మందగించినట్లు తెలిపింది.

27 ఏళ్ల కనిష్ఠానికి చైనా ఆర్థిక వృద్ధి రేటు

By

Published : Oct 18, 2019, 1:08 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు భారీగా తగ్గింది. బలహీనమైన దేశీయ డిమాండ్​, అమెరికా వాణిజ్యం యుద్ధం కారణంగా వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్ఠానికి చేరుకున్నట్లు నేషనల్​ బ్యూరో ఆఫ్​ స్టాటిస్టిక్స్​ (ఎన్​బీఎస్​) పేర్కొంది.

మూడో త్రైమాసికం (జులై-సెప్టెంబర్​) గణాంకాలు శుక్రవారం విడుదల చేసింది ఎన్​బీఎస్​. ఈ కాల వ్యవధిలో వృద్ధి రేటు 6 శాతంగా నమోదైనట్లు ప్రకటించింది. రెండో త్రైమాసికంలో అది 6.2గా ఉన్నట్లు పేర్కొంది.

1992 నుంచి నమోదైన వాటిలో అత్యంత తక్కువ గణాంకాలు ఇవేనని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. వార్షిక వృద్ధి రేటును 6-6.5 శాతానికి చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదైంది.

"జాతీయ ఆర్థిక వ్యవస్థ తొలి మూడు త్రైమాసికాలలో స్థిరత్వాన్ని కొనసాగించింది. స్వదేశీ, విదేశాలలో సంక్లిష్టమైన, తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం, అనిశ్చితులు పెరుగుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని మనం తెలుసుకోవాలి. సేవలు, తయారీ రంగాలు స్థిర వృద్ధిని నమోదు చేశాయి. ఉపాధి అవకాశాలు స్థిరంగా ఉన్నాయి."

-మావో షెంగ్యాంగ్​, ఎన్​బీఎస్​ అధికార ప్రతినిధి

ప్రభుత్వ చర్యలు..

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చైనా చర్యలు చేపట్టింది. ప్రధాన రంగాల్లో పన్నులు, ధరలు తగ్గించటం, స్టాక్​ మార్కెట్లలోకి విదేశీ నిధుల రాకపై ఆంక్షల సడలింపు వంటి నిర్ణయాలు తీసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి 28 బిలియన్​ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆ దేశ కేంద్ర బ్యాంకు ప్రకటించింది.

వృద్ధి రేటును తగ్గించిన ఐఎంఎఫ్​...

వాణిజ్యం యుద్ధం, దేశీయ డిమాండ్​ తగ్గుదలతో 2019 వృద్ధి అంచనాలను 6.2 నుంచి 6.1శాతానికి తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.

వాణిజ్య యుద్ధ ప్రభావం..

అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్యం యుద్ధ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై అధికంగా ఉంది. అమెరికా తాజా సుంకాల పెంపుతో సెప్టెంబర్​లో ఎగుమతులు, దిగుమతుల్లో ఊహించినదానికన్నా తక్కువ గణాంకాలు నమోదైనట్లు చైనా పేర్కొంది.

ఇదీ చూడండి:నీరు, గాలి, నేలపై 'రష్యా' అణు యుద్ధ విన్యాసాలు!

ABOUT THE AUTHOR

...view details