కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అయితే.. అక్టోబర్లో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి. తొలిసారి కరోనా ముందున్న స్థాయికి చేరుకున్నాయి.
చైనా కస్టమ్స్ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్లో ఎగుమతులు 11.4 శాతం వృద్ధితో 237.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్లో ఎగుమతులు 9.9 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 4.7 శాతం పెరిగి 178.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే.. అంతకు ముందు నెలలో(13.2 శాతం)తో పోలిస్తే దిగుమతులు భారీగా తగ్గటం గమనార్హం.
కరోనా వ్యాప్తి తర్వాత సత్వరం చైనా ఆర్థిక, సామాజిక కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవటం, మాస్కులు, ఇతర ఔషధాలు, వస్తువులకు డిమాండ్ పెరగటం వల్ల చైనా ఎగుమతులకు ఊతమందింది.
2020లో 10 నెలల కాలంలో మొత్తం ఎగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే.. 0.5 శాతం వృద్ధితో 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నుంచి ఎగుమతుల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే.. తొలి త్రైమాసికంలో 13.3 శాతం మేర క్షీణించాయి.