చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉంది. 2021 తొలి త్రైమాసికంలో (గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకొంటే) 18.3 శాతం వృద్ధి రేటును సాధించింది. 1992లో చైనా త్రైమాసిక వృద్ధిరేటును గణించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అతిపెద్ద వృద్ధిరేటు. వాస్తవానికి రాయిటర్స్ సంస్థ నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్థికవేత్తలు ఇది 19 శాతం వరకు ఉంటుందని భావించారు. కానీ, ఇది ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గతేడాది వృద్ధిరేటు పతనంతో పోలిస్తే ఇది భారీ అభివృద్ధి కిందే లెక్క. వీటిని చైనా గణాంకాల విభాగం విడుదల చేసింది.
చైనా వృద్ధిరేటు గణించేందుకు 2020 తొలి త్రైమాసికాన్ని బేస్‌లైన్‌గా ఎంచుకున్నారు. అప్పటికే కొవిడ్ వ్యాపించడం వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ కారణాలతో ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం పతనమైంది.
గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక వృద్ధిరేటు 14.1 శాతం, రిటైల్ విక్రయాలు 34.2 శాతం పెరిగాయి. 'నెలవారి సూచీలు కూడా అక్కడ ఉత్పత్తి, వ్యయం,పెట్టుబడులు క్రమంగా పుంజుకొన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి' అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆర్థికవేత్త లౌసీ క్యూజస్ పేర్కొన్నారు.