చైనా రాజకీయాల్లో కీలక ఘట్టానికి వేదికగా నిలిచే చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) నాలుగు రోజుల కాంక్లేవ్ (China Communist Party meeting) ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మూడోసారి అధికారం కట్టబెట్టే 'చారిత్రక తీర్మానం' ఈ సమావేశాల్లో ఆమోదం పొందనుంది. 400 మంది సీపీసీ సెంట్రల్ కమిటీ సభ్యులు సమావేశాలకు (China CPC meeting) హాజరయ్యారని స్థానిక వార్తా ఏజెన్సీ తెలిపింది.
వచ్చే ఏడాది చైనా జాతీయ కాంగ్రెస్ (పార్లమెంట్ వంటిది) (People's Congress of China) కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న నేపథ్యంలో... రాజకీయంగా ఈ సమావేశం జిన్‌పింగ్‌కు చాలా కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. సీపీసీ వ్యవస్థాపడుకు మావో జెడాంగ్ తర్వాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నేతగా మారిన జిన్‌పింగ్ (xi jinping news today).. జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని, అందుకు ఈ సమావేశాలే కీలకమని అంటున్నారు. జిన్‌పింగ్ మినహా తమ రెండో దఫా పూర్తి చేసుకున్న నేతలందరూ పదవిలో నుంచి దిగిపోయే అవకాశం ఉంది.
రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన వారు మరోసారి పోటీ చేయకూడదనే నిబంధన ఇదివరకు ఉండగా.. దీన్ని 2018 రాజ్యాంగ సవరణ ద్వారా జిన్‌పింగ్ మార్చేశారు. వచ్చే ఏడాది జిన్‌పింగ్ రెండోదఫా అధ్యక్ష పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన ఆశిస్తున్నారు. సీపీసీలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్‌పింగ్.. ఇప్పటికే పార్టీలోని కీలక స్థానాలను గుప్పిట పెట్టుకున్నారు. దేశాధ్యక్షుడిగా, సీపీసీ జనరల్ సెక్రెటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
నిర్ణయాలు ఏంటో..?
పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలను సమావేశాల చివరి రోజున ప్రకటించడం ఆనవాయితీ. సంస్కరణలు, కొత్త నియామకాలు, సిద్ధాంతాలు, పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలను చివరి రోజు వివరిస్తారు. తాజా సమావేశాల్లో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక సహా పార్టీలో పదవులు చేపట్టేందుకు ఉన్న వయోనిబంధనపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 68 ఏళ్లు దాటిన వారు అనధికారికంగా పదవీ విరమణ చేసే సంప్రదాయాన్ని మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ షియావోపింగ్ తీసుకొచ్చారు. దీని ప్రకారం చూస్తే.. ప్రస్తుత పొలిట్‌బ్యూరోలోని (china communist party politburo) 25 మంది సభ్యుల్లో 12 మందికి వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి 68 ఏళ్లు దాటుతాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను సడలిస్తారా అనే అంశంపై తాజా సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మూడో చారిత్రక తీర్మానం
తాజాగా ప్రవేశపెట్టనున్న తీర్మానానికి పార్టీ చరిత్రలో ప్రత్యేకమైనది. వందేళ్ల సీపీసీ చరిత్రలో 'చారిత్రక తీర్మానాన్ని' రెండుసార్లు మాత్రమే ప్రవేశపెట్టారు. 1945లో మావో, సాంస్కృతిక విప్లవం పేరుతో 1981లో డెంగ్.. చారిత్రక తీర్మానాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవేశపెట్టనున్న మూడో చారిత్రక తీర్మానం ఇదే కానుంది. జిన్‌పింగ్ రాజకీయ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా తీర్మానం ఉంటుందని చైనా రాజకీయ విశ్లేషకుడు వాంగ్ షింగ్వేయి పేర్కొన్నారు. పార్టీ తర్వాతి నాయకత్వం గురించి ప్రస్తావించే అవకాశాలు లేవని అన్నారు. పార్టీపై జిన్‌పింగ్‌కు ఉన్న పట్టు, ఆయన శక్తిసామర్థ్యాలు ఈ తీర్మానం ద్వారా మరోసారి నిరూపితమవుతాయని తెలిపారు.
ఇదీ చదవండి:చైనాపై సీపీసీ ఉక్కు పిడికిలి బిగించిందిలా...