చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి కాంక్లేవ్‌లో.. చారిత్రక తీర్మానానికి ఆమోదముద్ర (China CPC meeting) పడింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మూడోసారి అధికారాన్ని కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించింది.
పార్టీని, దేశాన్ని తన కనుసైగలతో నడిపిస్తున్న జిన్‌పింగ్‌కు.. ఇది తిరుగులేని విజయం అని చెప్పొచ్చు. జీవితకాలం అధ్యక్షుడిగా (XI Jinping President for life) కొనసాగాలని భావిస్తున్న ఆయనకు.. ఈ తీర్మానం తొలి అడుగుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
నవంబర్ 8 నుంచి 11 మధ్య సీపీసీ ప్లీనరీ సమావేశాలు (CPC Plenary session) జరిగాయి. ఈ సమావేశంలో సంస్కరణలు, కొత్త నియామకాలు, సిద్ధాంతాలు, పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలపై చర్చలు జరిపారు. ప్లీనరీలో జిన్‌పింగ్ కీలక ప్రసంగం చేశారు. సీపీసీ పొలిటికల్ బ్యూరో తరఫున హాజరై మాట్లాడారు. ముసాయిదా తీర్మానాన్ని భేటీలో చదివి వినిపించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలపై పూర్తి వివరాలను శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వెల్లడించనున్నారు.