తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశాలపై చైనా దూకుడు వెనుక కారణం?

కరోనా కారణంగా ప్రతిష్ఠ దిగజారి, ప్రపంచమంతా అనుమానాస్పదంగా చూస్తుంటే... తన పరిస్థితిని చక్కదిద్దుకోకుండా చైనా ఎందుకని దూకుడుగా వెళుతోంది? భారత్‌తో ఎందుకని ఘర్షణకు దిగుతోంది? ఎందుకని పదేపదే కవ్విస్తోంది? చైనా నాయకత్వం నిజంగానే యుద్ధానికి కాలుదువ్వుతుందా? లేక ఇంకేమైనా ప్రయోజనాలున్నాయా?

Chinas aggression against India Hong Kong US comes from sense of siege on pandemic origin
పలు దేశాలపై చైనా దూకుడు వెనుక....?

By

Published : Jun 18, 2020, 8:05 AM IST

నిజానికి చైనా కేవలం మన భారత్‌తో మాత్రమే ఘర్షణకు దిగటం లేదు. తన చుట్టూ ఉన్న అనేక దేశాలతోనూ ఇదే వైఖరి! థాయిలాండ్‌, లావోస్‌, కంబోడియా, వియత్నాంలతో కూడా చైనాకు కజ్జాలే. చైనాలో అడ్డుకట్టలు కట్టి... ఈ దేశాలకు నీళ్ళు లేకుండా చేసి... ఆయా దేశాల్లో కరువుకాటకాలకు కారణం అవుతోంది. జపాన్‌కు చెందిన సెన్‌కాకు ద్వీప సముద్రజలాల్లోకి ప్రవేశించి అవి మావే అంటోంది. దక్షిణచైనా సముద్రంలో వియత్నాం పడవల్ని ముంచేసింది. తైవాన్‌ను ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. ఇక హాంకాంగ్‌ పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. వీటన్నింటి వెనకా... కారణాల్ని అన్వేషిస్తే... చైనా నాయకత్వంలోని అసహనం రట్టవుతోంది.

దిగజారిన ఆర్థిక - సామాజిక పరిస్థితి

ఆర్థిక వ్యవస్థ

1990 తర్వాత అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితి చైనాలో ఈసారి నమోదైంది. చైనా ఆర్థిక వృద్ధి ఈసారి 6.8శాతం క్షీణించింది. ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో నడుస్తున్న సమయంలోనే అమెరికాతో వాణిజ్య యుద్ధం; ఆ వెంటనే కరోనా వచ్చిపడటం పరిస్థితిని మరింత దిగజార్చింది. అందుకే ఈ ఏడాది అసలు వృద్ధి లక్ష్యాన్నే నిర్దేశించుకోవద్దని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. తమ కమ్యూనిస్టు ప్రభుత్వానికి అద్దం పట్టే - పీఎల్‌ఏ డైలీ... ఇటీవలే అనూహ్యంగా ఓ వ్యాసాన్ని ప్రచురించింది. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనీ... దేశంలో అంతర్గతంగా ఆర్థిక-సామాజిక పరిస్థితులూ ప్రమాదకరంగా దిగజారాయాని... ఏ క్షణమైనా అవి పేలేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. జనాభాలో సుమారు 60 కోట్ల మంది నెలకు 140 డాలర్లకంటే తక్కువ సంపాదిస్తూ పేదరికంలో ఉన్నారని చైనా ప్రధాని లీ స్వయంగా ప్రకటించారు.

తేలని సరిహద్దుల్లో...

భారత్‌తో సరిహద్దు ఘర్షణ చైనాకు కొత్తేమీ కాదు. ఇదేమీ ఆగిపోయేదీ కాదు. కారణం- సరిహద్దు రేఖంటూ స్పష్టంగా ఎక్కడా లేకపోవటమే! కాబట్టి రెండు దేశాలూ ఇలా సరిహద్దు సంఘర్షణల్లో మునిగితేలటం గతంలో ఉంది... భవిష్యత్‌లోనూ ఉండొచ్చు. ఇలా ఘర్షణల ద్వారా ఒత్తిడులతో ఇతరత్రా ‘దౌత్య ప్రయోజనాలు’ పొందటం అంతర్జాతీయ దౌత్యనీతిలో సహజ పరిణామం. అలాకాకుండా... నిజంగా భారత్‌తో చైనా యుద్ధానికంటూ దిగితే అది రెండు దేశాలకే పరిమితం కాదనీ... చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి తెలుసు. కరోనా తదనంతర పరిణామాలను భారత్‌ తనకు అనుకూలంగా మలచుకోకుండా చేయటంలో, అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌కు రాకుండా చేయటానికి, భారత్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఏమీ లేవనే సంకేతాలను అంతర్జాతీయ సంస్థలకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుందనేది కొంతమంది విశ్లేషణ.

నిరుద్యోగ భూతం....

నిరుద్యోగం

చైనాలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి... ప్రజల్లో అసహనానికి దారి తీస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం కరోనా వైరస్‌కు ముందే చైనాలో పట్టణ నిరుద్యోగం 6 శాతంపైగా పెరిగింది. అయితే అధికారిక గణాంకాలకు రెట్టింపు సంఖ్యలో వాస్తవ నిరుద్యోగం ఉంటుందన్నది నిపుణుల అంచనా. గతంలో మౌలిక సదుపాయాల పేరుతో దేశవ్యాప్తంగా భారీగా చేపట్టిన ప్రాజెక్టులు, నగరాల నిర్మాణం... బ్రిడ్జిల నిర్మాణాల్లో చాలామటుకు తెల్ల ఏనుగుల్లా మారాయి. చాలా నిర్మాణాలు ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. దీన్నుంచి తప్పించు కోవటానికే... బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) పేరుతో మరో భారీ ప్రాజెక్టును చైనా ప్రభుత్వం చేపట్టింది. తద్వారా మరో 20 సంవత్సరాల దాకా తమ దేశంలోని కంపెనీలు, కార్మికులు చాలామందికి చేతినిండా పని కల్పించే ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలకు అప్పులిస్తూ వారిని తన గుప్పిట్లో ఉంచుకొని వ్యూహాత్మకంగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి ఎత్తులు వేసింది. భారత్‌ ఇందుకు మొదట్లోనే ససేమిరా అంటూ వ్యతిరేకించినా కొన్ని దేశాలు చైనా మాటకు తలొగ్గాయి. కానీ ఇప్పుడు చైనా మోపిన అప్పుల భారాన్ని, అందులోని మర్మాన్ని గ్రహించి మాతో కాదంటూ మయన్మార్‌లాంటి దేశాలు వెనక్కి తగ్గటం మొదలెట్టాయి.

అసంతృప్తి గళాలు...

కరోనా తదనంతర పరిణామాలు దేశంలో కూడా అసంతృప్తిని పెంచుతున్నాయి. వివిధ దేశాలు ఇప్పటికే చైనాతో తమ ఆర్థిక సంబంధాలను పునఃపరిశీలించుకోవటం ఆరంభించాయి.అనేక దేశాలు, కంపెనీలు చైనాతో, చైనాలోని కంపెనీలతో తమ వాణిజ్య సంబంధాలను పునఃసమీక్షించు కుంటుండటంతో అంతర్గతంగా అది చైనీయుల్లో ఆందోళనకు కారణమవుతోంది. వైరస్‌ గురించిముందే హెచ్చరించిన డాక్టర్‌ లి వెన్‌లియాంగ్‌ను నోరుమూయించటం కూడా స్వదేశంలోనే విమర్శలకు దారితీసింది. కరోనా కారణంగా చైనా విశ్వసనీయత దారుణంగా దెబ్బతింది. ఇవన్నీ సగటు చైనీయులపై మానసికంగా ప్రభావం చూపుతున్నాయి. చైనా ప్రభుత్వ ఉక్కుపిడికిలి కారణంగా మీడియాలో రాకున్నా అసమ్మతి గళాలు, మేధావులు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల స్వరం పెరుగుతోంది.

సొంత పార్టీలోనూ..

అంతేగాకుండా... చైనా నాయకత్వం పట్ల కమ్యూనిస్టు పార్టీలోనూ అసమ్మతిగళం చాపకింద నీరులా పెరుగుతోందన్నది పరిశీలకుల అంచనా! జీవితకాలంపాటు తనకే ఆధిపత్యం లభించేలా అధ్యక్షుడు షిజిన్‌పింగ్‌ చేసిన సవరణలు- కొత్తతరంలో అసంతృప్తి కి కారణమవుతుంటే... లక్షల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టడం.... ఏకవ్యక్తి పాలనను పాతతరం ఇష్టపడటం లేదు.అటు తైవాన్‌ తన స్వరాన్ని పెంచటం; హాంకాంగ్‌లో ఏడాదిగా ఆగని ఆందోళనలు... చైనాలో తమ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు పెంచుతున్నాయి.

వీటిన్నింటి నుంచీ తప్పించుకునే క్రమంలో హాంకాంగ్‌పై కఠిన నిర్ణయాలు; తైవాన్‌ విషయంలో అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావటం; దక్షిణచైనా సముద్రంలోకి చైనా నౌకాదళాన్ని దింపటం; భారత్‌తో సరిహద్దుల్లోనూ ఘర్షణ వాతావరణం... జిన్‌పింగ్‌ ప్రభుత్వానికి కలసి వచ్చే అంశాలుగా నిపుణులు భావిస్తున్నారు. జగడాలకు దిగి ప్రపంచాన్ని భయపెట్టడం కంటే కూడా... అంతర్గతంగా తనకు ఎదురవుతున్న సమస్యలను సర్దిపుచ్చుకోవటానికి, చైనీయుల్లో మళ్ళీ జాతీయతావాదం పేరుతో తన పెత్తనాన్ని నిలబెట్టుకోవాలనేదీ వీటన్నింటి వెనక షిజిన్‌పింగ్‌ ఎత్తుగడ అనే వాదనా ఉంది.

ABOUT THE AUTHOR

...view details