తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై సంచలన నిజాలతో చైనా శ్వేతపత్రం

కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి చైనా ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. కావాలనే ఈ వైరస్ గురించి ప్రపంచానికి తెలియకుండా చేయడానికి చైనా ప్రయత్నించిందన్న ఆరోపణలను ఖండించింది. తాము వైరస్​ను కట్టడి చేసేందుకు శాయశక్తులా కృషి చేశామని స్పష్టం చేసింది.

CHINA WHITE PAPER
కరోనాపై భారీ శ్వేతపత్రం విడుదల చేసిన చైనా

By

Published : Jun 7, 2020, 12:31 PM IST

Updated : Jun 7, 2020, 1:46 PM IST

కరోనా మహమ్మారి గురించి ప్రపంచాన్ని హెచ్చరించకుండా కావాలనే నిర్లక్ష్యం వహించిందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా... తాజాగా ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. వైరస్​ను కట్టడిచేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసినట్లు.. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

కప్పిపుచ్చే ప్రయత్నం

డిసెంబర్ 27న వుహాన్​లో కొవిడ్​-19ను గుర్తించినట్లు, దానిని వైరల్ న్యుమోనియాగా భావించినట్లు చైనా తెలిపింది. జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్​హెచ్​సీ) నిపుణుల బృందం జనవరి 19న... వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తున్నట్లు నిర్ధరణ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు తాము వేగంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు వచ్చిన ఆరోపణలను చైనా ఖండించింది. దీనిపై సుదీర్ఘ వివరణతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

జనవరి 3న ఈ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామని తెలిపింది. అమెరికా సహా ఇతర దేశాలకు కరోనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చామని వివరించింది.

ఆధారాలు లేకనే!

జనవరి 19 కంటే ముందు కరోనా వైరస్ మనుష్యుల ద్వారా వ్యాప్తి చెందుతుందని సూచించేందుకు తగిన ఆధారాలు ఏమీ లేవని, శ్వాసకోశ నిపుణుడు వాంగ్​ గువాంగ్​ఫా తెలిపారు. ఈయన ఎన్​హెచ్​సీ వుహాన్​కు పంపిన నిపుణుల బృందంలో ఒకరు.

గ్లోబల్ టైమ్స్​తో మాట్లాడుతూ... తమ బృందం వుహాన్​లో ప్రవేశించేనాటికి జ్వరంతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతున్నట్లు గుర్తించామని వాంగ్ తెలిపారు. అయితే వీరిలో చాలా మంది వుహాన్​లోని జంతు మాంసం అమ్మే మార్కెట్​తో సంబంధం లేనివారేనని ఆయన స్పష్టం చేశారు.

హుబే రాష్ట్రంలోని వుహాన్​లో న్యుమోనియా కేసులు గుర్తించిన వెంటనే చైనా ఎటియోలాజికల్, ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు నిర్వహించినట్లు వివరించారు. వ్యాధి వ్యాప్తిని ఆపడానికి చర్యలు తీసుకున్నామని, ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. గబ్బిలాలు, పాంగోలిన్ల ద్వారా వైరస్ సోకుతుందన్న అనుమానాలు ఉన్నా, అందుకు తగ్గ ఆధారాలు లేవని వాంగ్ వెల్లడించారు.

ట్రంప్ మాటే నిజమైందా?

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా మరణించారు. మరో 68 లక్షల మంది వైరస్​తో​పోరాడుతున్నారు. మరోవైపు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో చిక్కుకుపోయాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాలా నష్టపోయింది. దీని కంతటికీ చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే విమర్శలు గుప్పించారు. చైనా కరోనా సమాచారాన్ని అందించడంలో ఏ మాత్రం పారదర్శకంగా వ్యవహరించడంలేదని ఆరోపించారు.

మూలం కనుక్కోవాల్సిందే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కరోనా వైరస్ మూలాన్ని కనుగొనాలని ఓ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి చైనా కూడా మద్దతు ప్రకటించడం విశేషం.

మరో వైపు ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కొవిడ్-19 ఔషధాన్ని చైనా అందిస్తుందని చైనా సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్ అన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా కరోనా పోరు సాగించాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

Last Updated : Jun 7, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details