China military power: సాధారణంగా సముద్ర మార్గంలో సరకు రవాణాకు షిప్పింగ్ కంటైనర్లను వాడతారు. ఈ కంటైనర్ల సైజు ఓ భారీ వాహనమంత ఉంటుంది. ఒక్కో రవాణా నౌకలో ఇవి కొన్ని వందలు ఉంటాయి. ఇప్పుడు చైనా వీటిల్లో క్రూయిజ్ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను అమర్చి ప్రత్యర్థి దేశాల సమీపంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధ సమయంలో హఠాత్తుగా వీటి నుంచి కెనస్టర్లు (క్షిపణులను ప్రయోగించే గొట్టాలు) బయటకు వచ్చి ప్రత్యర్థులపై దాడులు చేసేలా సిద్ధం చేస్తోంది. అంతేకాదు.. ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రత్యర్థి యుద్ధనౌకలపై దాడి చేసి ముంచేసే అవకాశం ఉంది.
నిశ్శబ్దంగా శత్రువు ముంగిటికి..
కంటైనర్లను సాధారణంగా వాణిజ్య నౌకల్లో తరలిస్తారు. దీంతో ప్రత్యర్థి దేశాల నావికాదళాలు వీటిని పెద్దగా అనుమానించవు. దీనిని ఆసరాగా చేసుకొని కంటైనర్ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను శత్రువుల ఓడ రేవుల్లోనే సరకుల కంటైనర్ల టెర్మనల్స్ మధ్యలోకి చేర్చవచ్చు. అవసరమైన సమయంలో వాటితో దాడులు చేయవచ్చని ఇంటర్నేషనల్ అసెస్‌మెంట్ అండ్ స్ట్రాటజీ సెంటర్‌కు చెందిన రిక్ ఫిషర్ అనే పరిశోధకుడు పేర్కొన్నాడు. ఆయన 'స్టాక్టన్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా'కు రాసిన పత్రంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కంటైనర్లను ఆయుధాలుగా మార్చే సామర్థ్యం చైనాకు ఉందని పేర్కొన్నారు.
ప్రత్యర్థుల తీరప్రాంత రక్షణ వ్యవస్థలపై ఒక్కసారిగా దాడి చేసి ధ్వంసం చేయడానికి ఈ కంటైనర్లు చాలా అనువుగా ఉంటాయి. వీటిలో వాడే క్రూయిజ్ క్షిపణులు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. దీంతో వీటిని రాడార్లు వెంటనే గుర్తించలేవు. తీరప్రాంత రక్షణ వ్యవస్థలు ధ్వంసమైతే సముద్ర మార్గంలో ఆ దేశంపై దాడి చేయడం చైనాకు సులువుగా మారిపోతుంది. అంతేకాదు ఈ దాడి శత్రువును తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంది.
ఉగ్రదాడి ముసుగులో..
చైనా వీటి రవాణాకు కంటైనర్ షిప్‌లు, వేలకొద్దీ చేపల వేట పడవలు వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక యుద్ధ సమయంలో సైనిక దాడికి వీటిని వినియోగించొచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో చేతికి మట్టి అంటకుండా.. వీటి ద్వారా ప్రత్యర్థి దేశంపై దాడి చేసి.. అనంతరం దీనిని ఉగ్రవాదుల పనిగా చూపించి చేతులు దులుపుకొనే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సరకు రవాణా చేసే పోర్టుల్లో ఆరు రేవులు చైనాలో ఉండటం వీటి తరలింపునకు కలిసొచ్చే అంశంగా మారింది.
చాలా దేశాల వద్ద ఇలాంటి వ్యవస్థలు..
2016లో రష్యాకు చెందిన ఓ రక్షణ రంగ సంస్థ కంటైనర్లలో క్షిపణులు పెట్టే మోడల్‌ను ప్రదర్శించింది. క్యాలిబర్ క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా క్లబ్-కె పేరిట దీనిని అభివృద్ధి చేసింది. మొత్తం నాలుగు క్షిపణులను ఇది ప్రయోగించగలదు. దీంతోపాటే లాంఛ్ కంట్రోల్స్, టార్గెటింగ్ వ్యవస్థలు కూడా ఉంటాయి.